18 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం పలు సామాజిక, సహకార, అభివృద్ధి సంస్థలకు కొత్త ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లను నియమించింది. గ్రామపంచాయతీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Telangana Logo
Telangana Govt Appoints Heads to 18 Corporations

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక, సహకార, అభివృద్ధి సంస్థలకు కీలక నియామకాలు చేపట్టింది. మొత్తం 18 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో గ్రామపంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీఓఆర్‌టీ నెం.601 ప్రకారం పలు కుల, వృత్తి ఆధారిత కార్పొరేషన్లకు కొత్త బాధ్యులను నియమించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు బస్వరాజు శ్రీనివాస్‌ను ఛైర్మన్‌గా, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌ను వైస్ ఛైర్మన్‌గా నియమించారు. అలాగే రజక సహకార సంస్థకు డాక్టర్ దాసరిజు అజయ్ కుమార్, బంగారు బాబు; తాటి తాపీ కార్పొరేషన్‌కు మోటుకూరి చంద్రశేఖర్ గౌడ్, కేసం నాగరాజు గౌడ్‌లకు బాధ్యతలు అప్పగించారు.

Also Read : గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్

ఇక పెరిక, మేర, వాల్మీకి బోయ, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర కార్పొరేషన్లకు కూడా కొత్త ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు నియమితులయ్యారు. తెలంగాణ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు దూడెం వెంకట్ రమణను ఛైర్మన్‌గా నియమించగా, కమ్మ కార్పొరేషన్‌కు బండి రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

మరో ఉత్తర్వు (జీఓఆర్‌టీ నెం.600) ద్వారా పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్‌కు గూడూరు శ్రీనివాస్, తెలంగాణ భట్టరాజ సహకార సంఘాల సమాఖ్యకు చి. బాలరాజు, వెలమ కార్పొరేషన్‌కు జువ్వాడి నర్సింగ్ రావు నియమితులయ్యారు. తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌కు కొల్లె సారిత, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి చరణ్ కౌశిక్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణ తెలుగు అకాడమీకి ప్రొఫెసర్ వెంకట నారాయణను నియమించగా, ఖమ్మంలోని స్థంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (SUDA)కి పువ్వాల దుర్గాప్రసాద్‌ను ఛైర్మన్‌గా నియమించారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థకు మహమ్మద్ ఖాదర్ అలీని నాన్-అఫీషియల్ మెంబర్ మరియు ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అదే సమయంలో గ్రామపంచాయతీలకు సంబంధించిన వివాదాలు, పరిపాలనా అంశాల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్‌కు సుదిని రామిరెడ్డిని ఛైర్మన్‌గా నియమించగా, కృష్ణకుమార్ నాగులూరి, బూసా వేణుగోపాల్ యాదవ్ సభ్యులుగా నియమితులయ్యారు. ట్రిబ్యునల్ పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు.

Also Read : తెలంగాణ పంచాయతీలకు కేంద్రం మరో గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం కింద రూ.387.53 కోట్లు విడుదల

తెలంగాణలో వివిధ వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటైన కార్పొరేషన్లు సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నియామకాల ద్వారా ప్రభుత్వం కుల, వృత్తి ఆధారిత సంఘాలకు మరింత ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు గ్రామస్థాయిలో వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో కీలకంగా మారే అవకాశం ఉందని పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేస్తున్నారా.. ఫిబ్రవరి 23 కేబినెట్ సమావేశం కీలకం

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »