తెలంగాణలో ముందుగానే మండుతున్న ఎండలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో వేసవి తీవ్రత ముందుగానే కనిపిస్తోంది. మార్చి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్

Telangana temperature update
PC: ChatGpt AI Generator

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు భగ్గుమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలవడంతో రాష్ట్రవ్యాప్తంగా వేడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ఏడాదిలో తొలిసారిగా ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 2.2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read: తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా.. కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం..

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనితో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగతా 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఈ వారం మొత్తం తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 1 నుండి 1.5 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయాల్లో వేడి తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని చెప్పారు.

ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు పొడి మరియు వేడి గాలులు వీస్తుండటమే ఈ తీవ్రతకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

అధికారుల హెచ్చరికలు..

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరం డీహైడ్రేట్ కాకుండా తరచూ నీరు, పండ్ల రసాలు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉండాలని, సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికాకుండా చూసుకోవాలని సూచించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »