తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా.. కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

సీనియర్ రాజకీయ నాయకుడు శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా నియమించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం పలు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు చేపట్టడంతో ఈ నిర్ణయం వ్యూహాత్మకమని విశ్లే

Telangana New Governor

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా సీనియర్ రాజకీయవేత్త శివ ప్రతాప్ శుక్లా నియమితులవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. దీర్ఘకాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం ద్వారా రాష్ట్ర పాలనలో కొత్త ఉత్సాహం నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 1952లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన శివ ప్రతాప్ శుక్లా విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన, విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు.

తరువాత ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1989 నుంచి 2002 వరకు గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ కాలంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో జైళ్లు, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారు. పాలనా వ్యవహారాల్లో అనుభవం, పరిపాలనా నైపుణ్యంతో ఆయన మంచి పేరు సంపాదించారు.

కీల‌క నిర్ణ‌యాల్లో పాత్ర‌..

కేంద్ర రాజకీయాల్లో కూడా శివ ప్రతాప్ శుక్లా తన ముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తరువాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న మక్కువను ఆ సందర్భంలో ఆయన స్పష్టంగా చాటుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమితులవడంతో మరో కీలక రాజ్యాంగబద్ధ బాధ్యతను చేపట్టబోతున్నారు.

Also Read: విజయ్–త్రిష దొరికిపోయారుగా.. విడాకుల వార్తల మధ్య పెళ్లి రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు చేపట్టడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేయగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ బాధ్యతలను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి అప్పగించారు.

రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మా..

అదేవిధంగా నాగాలాండ్‌కు నంద్ కిశోర్ యాదవ్‌ను గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్‌ను గవర్నర్‌గా నియమించడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ నియామకం కావడం గమనార్హం.

ఈ నియామకాలు కేవలం పరిపాలనా మార్పులుగా కాకుండా రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, రాజ్యాంగ విలువలను కాపాడటం, కేంద్ర–రాష్ట్ర సంబంధాలను సమతుల్యం చేయడం వంటి అంశాల్లో గవర్నర్లు కీలక పాత్ర పోషిస్తారని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా గవర్నర్‌గా రావడం రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయం మధ్య సమన్వయం ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »