పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు . బలవంతంగా వసూలు చేయోద్దు..!

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల (Telangana Traffic Challans)పేరుతో వాహనదారులను ఆపడం, బలవంతంగా చెల్లింపులు చేయించడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ చలాన్ల వసూలు కేవలం న్యాయ ప్రక్రియ ద్వారానే జరగాలని పేర్కొంటూ వాహనదారులకు కీలక ఊరటనిచ్చింది.

Telangana High Court Orders on Pending Traffic Challans
Telangana High Court Orders on Pending Traffic Challans

Telangana Traffic Challans

  • పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనదారులను ఆపడం లేదా బలవంతం చేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

  • చలాన్ల వసూలు కోసం వాహన తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేయరాదని కోర్టు ఆదేశించింది.

  • ట్రాఫిక్ చలాన్ల వసూలు కేవలం న్యాయ ప్రక్రియ ద్వారా, కోర్టు నోటీసుల వంటి చట్టబద్ధ మార్గాల్లోనే జరగాలని హైకోర్టు పేర్కొంది.

ట్రాఫిక్ చలాన్ల(Telangana Traffic Challans) అంశంపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఆటోమెటిక్‌గా చలాన్లు కట్ అయ్యేలా ఆధునిక టెక్నాలజీ తీసుకురావాలని సీఎం సూచించడంతో పాటు, కఠిన అమలుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు అంశంపై తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ హైకోర్టు స్పష్టంగా పేర్కొన్న అంశం ఏమిటంటే… పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించమని చెప్పి వాహనదారులను పోలీసులు ఆపకూడదు, ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకూడదు. చలాన్లు చెల్లించాలనుకునే పౌరులు తమ ఇష్టానుసారం, స్వచ్ఛందంగా చెల్లించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు కీలక ఆదేశాలు:

  • హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు జారీ చేసిన ముఖ్య ఆదేశాలు ఏంటంటే
  • పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయన్న కారణంతో వాహనదారులను ఆపకూడదు
  • చలాన్లు చెల్లించమని బలవంతం చేయరాదు
  • వాహన తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేయరాదు
  • చలాన్ల విషయంలో చర్యలు తీసుకోవాలంటే సరైన న్యాయ ప్రక్రియ తప్పనిసరి
  • కోర్టు నోటీసులు వంటి చట్టబద్ధమైన మార్గాల ద్వారానే వసూలు చేయాలి

పిటిషన్లపై విచారణ :

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అమలు విధానాలను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన శ్రీ వి. రాఘవేంద్ర చారి తెలంగాణ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం (జనవరి 20) విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

పిటిషనర్ వాదనలు :

  • పిటిషనర్ తన వాదనలో ముఖ్యంగా ఈ అంశాలను ప్రస్తావించారు:
  • కేవలం పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను ఆపే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు
  • మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధించే అధికారం న్యాయస్థానానికే ఉంటుంది
  • ట్రాఫిక్ అమలులో అనధికార మొబైల్ పరికరాల వినియోగం చట్టవిరుద్ధం
  • G.O. Ms. No. 108 ఆధారంగా పౌరులను బలవంతంగా చలాన్లు చెల్లించమని ఒత్తిడి చేయడం తప్పు
  • ఆ జీవో కేంద్ర మోటారు వాహనాల చట్టానికి విరుద్ధం

పౌరులకు ఊరట :

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో సాధారణ వాహనదారులకు ఊరట లభించింది. పెండింగ్ చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వేధింపులకు పాల్పడకుండా ఉండేందుకు ఈ ఆదేశాలు మార్గదర్శకంగా నిలవనున్నాయి. అదే సమయంలో, ట్రాఫిక్ నిబంధనల అమలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరగాలనే సందేశాన్ని కోర్టు స్పష్టంగా ఇచ్చింది.

ఈ ఆదేశాల నేపథ్యంలో ట్రాఫిక్ చలాన్ల అమలు విధానాల్లో ప్రభుత్వం, పోలీసు శాఖ ఎలాంటి మార్పులు తీసుకొస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉంటే పోలీసులు వాహనాన్ని ఆపవచ్చా?

A: లేదు. కేవలం పెండింగ్ చలాన్లు ఉన్నాయన్న కారణంతో వాహనాన్ని ఆపడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

Q2: ట్రాఫిక్ పోలీసులు చలాన్లు చెల్లించమని బలవంతం చేయగలరా?

A: చేయలేరు. చలాన్లు చెల్లించడం పూర్తిగా వాహనదారుడి స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని కోర్టు తెలిపింది.

Q3: పెండింగ్ చలాన్లు ఎలా వసూలు చేయాలి?

A: కోర్టు నోటీసులు లేదా ఇతర చట్టబద్ధ న్యాయ ప్రక్రియల ద్వారా మాత్రమే వసూలు చేయాలి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »