చేప ప్రసాదం కోసం ట్రాఫిక్ ఆంక్షలు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Fish Prasadam 2026
చేప ప్రసాదం కోసం ట్రాఫిక్ ఆంక్షలు.

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న చేప ప్రసాదం కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ఏర్పాట్లు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు

ఎంజే మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, నాంపల్లి జీపీఓ వైపు మళ్లించనున్నారు. అలాగే ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మార్గాల వైపు మళ్లిస్తారు.

ఎంజే మార్కెట్ నుంచి తాజ్ ఐలాండ్ వరకు ప్రైవేట్, భారీ వాహనాల రాకపోకలను అనుమతించరు. వాటిని ఎంజే మార్కెట్, ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జీపీఓ వైపు మళ్లిస్తారు.

చేపలు తీసుకువచ్చే నీటి ట్యాంకర్లు, ఆహార పదార్థాలు తీసుకువచ్చే స్వచ్ఛంద సంస్థల వాహనాలు చెల్లుబాటు అయ్యే పాస్‌లతో గేట్ నెం.3 ద్వారా మాత్రమే ప్రవేశించాలి.

పార్కింగ్ ఏర్పాట్లు

నాంపల్లి వైపు నుంచి వచ్చే నాలుగు చక్రాల వాహనాలు గ్రుహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలిపి గేట్ నెం.2 ద్వారా కాలినడకన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి.

ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద, నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు షెజాన్ హోటల్ పక్కన ఉన్న భీంరావ్ బాడా వద్ద పార్కింగ్ చేసుకోవాలి.

బస్సులు, వ్యాన్లకు ప్రత్యేక ఏర్పాట్లు

ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే బస్సులు, వ్యాన్లు గాంధీ భవన్ బస్ స్టాప్ వరకు మాత్రమే అనుమతిస్తారు.

నాంపల్లి వైపు నుంచి వచ్చే బస్సులు, వ్యాన్లు గ్రుహకల్ప బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను దించి, అక్కడి నుంచి కాలినడకన గేట్ నెం.2 ద్వారా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి.

ప్రభుత్వ బస్సులు, వ్యాన్ల పార్కింగ్ కోసం సీడబ్ల్యూసీ (CWC) పార్కింగ్ ప్రాంతాన్ని కేటాయించారు.

వీఐపీ వాహనాలకు ప్రత్యేక మార్గం

వీఐపీ పాస్ కలిగిన వాహనాలు ఎంజే మార్కెట్ నుంచి గాంధీ భవన్ చేరుకుని, అదాబ్ హోటల్ లేన్ ద్వారా గేట్ నెం.1, సీడబ్ల్యూసీ గేట్ మార్గంలో వీఐపీ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవాలి.

నాంపల్లి వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు గాంధీ భవన్ వద్ద యూ-టర్న్ తీసుకుని గేట్ నెం.1, సీడబ్ల్యూసీ గేట్ మార్గంలో ప్రవేశించాలి.

అన్ని వీఐపీ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్ ప్రాంతంలో నిలిపివేయాలని పోలీసులు సూచించారు.

సహాయం కోసం హెల్ప్‌లైన్

ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం లేదా సహాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »