కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. కోర్ అర్బన్ రీజియన్‌లో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేస్తూ, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Telangana government housing construction under Indiramma scheme

తెలంగాణలో పేదలకు గృహసౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాది ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం, తాజాగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నిర్మాణాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేయనున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇండ్ల స్థలాలు ఉన్న సుమారు 28 వేల మంది లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా మంజూరు పత్రాలు అందజేయాలని సూచించారు.

Also Read: హైదరాబాద్‌లో GHMC ప్రారంభించిన ‘MyCURE’ యాప్ వెనుక ఏముంది?

ఇందిరమ్మ మోడల్ టవర్లకు ప్రణాళిక

మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ టవర్ల నిర్మాణం, స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు వంటి అంశాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్లు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఈ విషయంపై కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మధ్య తరగతి వర్గాలకు గృహాలు

ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ పరిధిలో మధ్య తరగతి ప్రజల కోసం గతంలో కేబీహెచ్‌బీలో నిర్మించిన మాదిరిగా ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

2బీహెచ్‌కే ఇండ్లపై దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న మరియు ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులే పూర్తి చేసుకునే విధంగా ముందుగా ఖర్చైన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఇప్పటికే ఇండ్లు కేటాయించబడినా నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, బోగస్ లబ్ధిదారులను తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనర్హుల స్థానంలో సమీపంలో ఉన్న అర్హులైన పేదలను రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయాలని సూచించారు. అలాగే 2బీహెచ్‌కే కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు స్పష్టం చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »