తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండగా, రేపటి నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
5 నిమిషాల గ్రేస్ టైమ్
విద్యార్థులు ఉదయం 9.05 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో 9.01 వరకే అనుమతి ఉండేది. దీనివల్ల కొందరు విద్యార్థులు పరీక్షలు మిస్ అయ్యే పరిస్థితులు ఏర్పడేవి. ఈసారి నిమిషం నిబంధనను సడలించి 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. అయినప్పటికీ అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులు పూర్తి మూడు గంటల పాటు పరీక్షా కేంద్రాల్లోనే ఉండాలి. పరీక్ష ముందుగానే పూర్తి చేసినా మధ్యాహ్నం 12 గంటల వరకు బయటకు అనుమతి లేదు.
ఆర్టీసీ గుడ్ న్యూస్
ఇంటర్ విద్యార్థులకు TGSRTC శుభవార్త ప్రకటించింది. బస్సుల్లో ప్రయాణించే సమయంలో అమ్మాయిలు ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ చూపిస్తే చాలు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అదనపు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎక్కడ ఆపినా బస్సులు ఆపాలని, హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని, పాస్ అడగొద్దని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. పరీక్షలు ధైర్యంగా రాయాలని సూచించారు.
మూల్యాంకనం షెడ్యూల్
ఇంటర్ బోర్డు సమాధాన పత్రాల మూల్యాంకన షెడ్యూల్‌ను ప్రకటించింది.
మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభం
మార్చి 15 నుంచి మొదటి విడత
మార్చి 18 నుంచి రెండో విడత
మార్చి 20 నుంచి మూడో విడత
ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా, సమయపాలన పాటిస్తూ పరీక్షలకు హాజరవాలని అధికారులు సూచిస్తున్నారు.

