తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు .. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత ఉందని వ‌స్తున్న‌ వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని హామీ ఇస్తూ, బ్లాక్ మ

Minister Uttam Kumar Reddy

రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయ‌న తెలియ‌జేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందని, సరఫరాలో అంతరాయం ఏర్పడిందని వస్తున్న వార్తలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రతి వినియోగదారుడికి అవసరమైన సిలిండర్లు సరఫరా చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.

అక్ర‌మాలు అస్స‌లు స‌హించం..

గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి అసౌకర్యం కలిగినట్టు మా దృష్టికి వ‌స్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం లేదా అక్రమంగా విక్రయించడం జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Also Read: నాగర్‌కర్నూల్‌లో దారుణం… ఇంటర్ విద్యార్థి అరాచకం, ముగ్గురు బాలికలపై దాడి

అలాగే హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్టల్స్ వంటి కీలక సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. నిత్యావసర సరఫరాలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

భ‌యంతో ముందస్తు బుకింగ్‌లు…

ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లకు పోటెత్తుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా క్రాష్ అయినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాంతంలో గ్యాస్ గోడౌన్‌ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఖాళీ సిలిండర్లతో ప్రజలు గ్యాస్ కోసం వేచి ఉన్నారు. మూడు రోజుల క్రితం బుకింగ్ చేసినప్పటికీ ఇప్పటికీ డెలివరీ అందలేదని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.

అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనవకుండా సాధారణంగా బుకింగ్ చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అలాగే అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »