కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. గడువు లేకుండా జారీ ప్రక్రియ కొనసాగింపు

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ఎలాంటి గడువు లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Telangana New Ration Cards
Telangana New Ration Cards

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దానికి ఎలాంటి గడువు లేదని వెల్లడించారు. అర్హత ఉన్నవారికి అధికారులు దశలవారీగా రేషన్ కార్డులు జారీ చేస్తారని, అర్హులైన ప్రతీ కుటుంబానికి కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జూన్ 2న జరుపుకునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ను ఘనంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలుసుకోండి: తెలంగాణలో రేషన్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలి?

మార్చి 6 నుంచి 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృతంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా అందించేందుకు టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఆన్‌లైన్ విధానాల ద్వారా సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేయాలని తెలిపారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందించేందుకు “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 100 మండలాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అర్హులకు సంక్షేమ పథకాల పూర్తి అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రేషన్ కార్డులతో పాటు మహాలక్ష్మి పథకం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అర్హులైన కుటుంబాలకు తప్పనిసరిగా అందాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను మరింత మెరుగుపర్చేందుకు నూతన విధానాలు రూపొందించాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “ప్రజా పాలన” కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించగా, లక్షలాది మంది అప్లై చేశారు. ఇప్పటికే పలు కార్డులు జారీ అయినప్పటికీ, ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి :తెలంగాణ విద్యలో సంస్కరణలు: ఎంసెట్ రద్దు ప్రతిపాదన, ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రి సీట్ల కేటాయింపు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »