హైదరాబాద్: మండుటెండకు అలసిన తెలంగాణకు వర్షాల చల్లదనం రానుంది (Telangana Rain Alert). అయితే అది పూర్తిగా శుభవార్త కాదు ముఖ్యంగా పొలాల్లో పంటలు చేతికొచ్చిన రైతులకు ఈ వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేసే పరిస్థితి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మార్చి 16 నుండి 23 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
ఏ జిల్లాలకు యెల్లో అలర్ట్?
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఆగ్నేయ దిశ నుండి వీస్తున్న తేమ గాలులు, స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వర్షాలు వస్తున్నాయని అధికారులు వివరించారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.
మార్చి 14 వరకు ఎండలు, 16 నుండి వర్షాలు
ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావడం కష్టంగా మారింది. మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మార్చి 14 వరకు ఈ ఎండల తీవ్రత కొనసాగుతుందని, 16 నుండి వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రైతులకు కీలక హెచ్చరిక
వర్షాల వల్ల ఎండ నుండి ఉపశమనం లభించినా రైతులకు మాత్రం ఇది ఆందోళన కలిగించే వార్త. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పంటలు కోత దశలో ఉన్నాయి. కొన్నిచోట్ల కోసిన పంటలు కల్లాల్లో ఉన్నాయి. ఈదురు గాలులు, వర్షాలు వస్తే ఆ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో రైతులు ముందస్తుగా పంటలను సురక్షితంగా నిల్వ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ప్రజలకు జాగ్రత్తలు
వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండవద్దని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు వర్షం సూచనలు కనిపించగానే తక్షణమే సురక్షిత స్థలానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణలో అకాల వర్షాలు.. హైదరాబాద్‌లో కుండపోత, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్