పెండింగ్ చలాన్లపై కఠిన చర్యలు .. నిర్ల‌క్ష్యం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్ చేయ‌నున్న‌ తెలంగాణ ప్రభుత్వం

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా వదిలేస్తే ఇకపై భారీ ఇబ్బందులు తప్పవు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ)లను ఫ్రీజ్ చేసే కఠిన విధాన

Telangana traffic challan rules

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూలును వేగవంతం చేయడంతో పాటు, వివాదాల పరిష్కారంలో పారదర్శకత తీసుకురావడానికి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

ఈ కొత్త విధానం ప్రకారం, ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాహనదారులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే ఫిర్యాదు నమోదు చేయాలి. ఆఫ్‌లైన్ విధానానికి ఇకపై అవకాశం ఉండదు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు హైదరాబాద్, సైబరాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాల్లో ఎస్పీలు లేదా అదనపు ఎస్పీలు పరిశీలిస్తారు. రవాణా శాఖ పరిధిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు ఈ ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

గ్రీవెన్స్ రెడ్రెస‌ల్ అథారిటీ ఏర్పాటు..

సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ తప్పులు, వాహనం విక్రయించిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను అధికారులు నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా “గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ” ఏర్పాటు చేయనున్నారు.

Also Read: Vivo X300 Ultra, X300s లాంచ్ తేదీ ఖరారు… 200MP కెమెరాతో కొత్త ఫ్లాగ్‌షిప్ హంగామా

చలాన్ల జారీ మరియు పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన గడువులు నిర్ణయించింది. కెమెరా ఆధారిత చలాన్లు 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్లు 15 రోజుల్లో వాహనదారులకు చేరాలి. చలాన్ అందిన 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరం నమోదు చేయాలి. ఫిర్యాదు చేసినట్లయితే, 30 రోజుల్లోపు అధికారులు తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు.

కోర్టు తీర్పు ఆధారంగా చర్య‌లు..

అధికారుల నిర్ణయంతో ఏకీభవించని పక్షంలో, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కల్పించారు. కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి.

పెండింగ్ చలాన్లపై కఠిన చర్యలు

ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటం ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే, ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు చేరుతుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని బ్లాక్ చేస్తారు. ఈ పరిస్థితిలో ఆ వాహనానికి లేదా లైసెన్స్‌కు సంబంధించిన ఎటువంటి సేవలు అందుబాటులో ఉండవు.

పెండింగ్ చలాన్లన్నీ చెల్లించిన తర్వాత మాత్రమే ఆ సేవలను తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా రహదారి భద్రతను పెంచడమే కాకుండా, వాహనదారుల్లో బాధ్యతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »