క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత… రాళ్ల దాడులు, లాఠీచార్జ్‌తో హై టెన్షన్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి ఉద్రిక్త వాతావరణానికి దారితీశాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. రాళ్ల దాడులు, లాఠీచార్జ్ మధ్య పలువురు గాయపడగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Police controlling clashes during Kethanapalli municipal election

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. నిన్న వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను నేడు తిరిగి నిర్వహించేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకోగా, ముందుగా భారత రాష్ట్ర సమితి మరియు సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో వచ్చారు. అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి హాజరయ్యారు.

రాళ్ల దాడి..

ఈ సమయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాట, దాడులకు దారితీసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన సమయంలో మంత్రి కాన్వాయ్ అక్కడికి చేరుకోగా, కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలు వాహనంపై రాళ్ల దాడికి దిగారు. దీంతో వాహనం ధ్వంసమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: చంద్రబాబుతో తుమ్మల భేటీ… రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు వేగం ఎలా?

ఇక నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలోనే క్యాతనపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే, పోలీసులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా, చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్తున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ఆమెపై కేసు నమోదైందని, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాల్క సుమ‌న్‌పై కూడా రాళ్ల దాడి..

అంతకుముందు బాల్క సుమన్‌పై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగడంతో అక్కడ మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. దీనికి ప్రతిగా బీఆర్‌ఎస్ నాయకులు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి అదుపుతప్పింది. వెంటనే పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేసి గుంపులను చెదరగొట్టారు. మొత్తం మీద క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య హైటెన్షన్ వాతావరణంలో కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »