“లాస్ట్ ఛాన్స్ ప్లీజ్”.. రాజ్యసభ కోసం వీహెచ్ గట్టి లాబీయింగ్.. హైకమాండ్ నిర్ణయం ఏమిటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత వి.హనుమంతరావు రాజ్యసభ పదవికి చివరి అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను వేడుకుంటున్నారు. 50 ఏళ్లుగా పార్టీకి సేవలందించానని, ఇదే తనకు ఆఖరి ఛాన్స్ అని చెబుతున్న వీహెచ్ విజ్ఞప్తిప

V hanumantha Rao

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ నాయకుడు వి హ‌నుమంత‌రావు (వీహెచ్) రాజ్యసభ పదవిపై తన ఆశలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. “ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. ఇదే నాకు ఆఖరి అవకాశం” అంటూ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. రాజ్యసభ పదవిని ఆశిస్తూ వీహెచ్ ఢిల్లీలో మకాం వేసి కీలక నేతలను కలుస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేలను కలిసి తన విన్నపాన్ని వినిపించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కూడా పలుమార్లు కలిసి అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.

50 ఏళ్ల సేవలు.. ఎన్నో త్యాగాలు

ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని, పార్టీనే నమ్ముకుని రాజకీయ జీవితం గడిపానని వీహెచ్ చెబుతున్నారు. పదవులు అనుభవించిన తర్వాత చాలా మంది పార్టీని వీడినా, తాను మాత్రం ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నానని గుర్తు చేస్తున్నారు. ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపనలో తన పాత్రను ప్రస్తావిస్తూ, అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని రెండుసార్లు ప్రయత్నించినా అవకాశం రాలేదని చెబుతున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి తప్పుకున్నానని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో సందర్భాల్లో త్యాగాలు చేశానని, అవకాశాలను కోల్పోయానని అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.

Also Read: Hyderabad Mega Infra Boost: GHMC ఆమోదించిన ఫ్లైఓవర్లు, ROBలు… ₹500 కోట్లు కేటాయింపు

వయసును దృష్టిలో పెట్టుకుని విజ్ఞప్తి

తన వయసును దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ పదవి ఇవ్వాలని వీహెచ్ ప్రత్యేకంగా కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత పదేళ్లలో తనపై 16 కేసులు నమోదయ్యాయని, అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూనే ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన పలువురికి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇచ్చారని, కానీ తాను ఎప్పుడూ ఏ పదవి అడగలేదని పేర్కొంటున్నారట. ఈసారి అవకాశం ఇస్తే ఇకపై ఎప్పుడూ ఏ పదవి కోరనని స్పష్టం చేసినట్లు సమాచారం.

రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని అధిష్టానం కోటాలో ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మ‌ను సింగ్వికు కేటాయించే నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో సీటు ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పార్టీకి విధేయుడిగా ఉన్న వీహెచ్‌కు ఈసారి అధిష్టానం అవకాశం కల్పిస్తుందా? లేక వేరే సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి “లాస్ట్ ఛాన్స్ ప్లీజ్” అంటూ హనుమంతరావు చేస్తున్న విన్నపం హైకమాండ్‌ను ఎంతవరకు కదిలిస్తుంది అన్నది త్వరలోనే తేలనుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »