Hyderabad New Elevated Corridor: హైదరాబాద్‌లో నాలుగు లైన్లతో కొత్త హైవే.. హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు

Hyderabad New Elevated Corridor: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్ నుండి మెహిదీపట్నం వరకు 3 కిలోమీటర్ల మేర కొత్త ఫోర్-లేన్ ఎలివేటెడ్ హైవే నిర్మాణానికి HMDA ప్లాన్.

Hyderabad New Elevated Corridor
Hyderabad New Elevated Corridor

Hyderabad : భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలో ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం వెళ్లే రూట్లో ట్రాఫిక్ రద్దీ ఇప్పటికీ పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే, వాహనదారులకు ఊరట కలిగిస్తూ బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం కనెక్టివిటీని పెంచేందుకు హెచ్‌ఎండీఏ (HMDA) సరికొత్త ఫోర్-లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) త్వరలోనే పూర్తి కానుంది. ఈ పనులు పూర్తయితే పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

3 కిలోమీటర్ల కారిడార్.. అప్, డౌన్ ర్యాంపుల వివరాలు ఇవే!

ప్రతిపాదిత నాలుగు లైన్ల ఎలివేటెడ్ హైవే సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉన్న జీవీకే వన్ మాల్ (GVK One Mall) సమీపంలో ప్రారంభమయ్యే ఈ కారిడార్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నంలోని పీపీఎన్‌ఆర్ (PPNR) ఎక్స్‌ప్రెస్ హైవేకి అనుసంధానం చేయబడుతుంది. వాహనాల రాకపోకలు సులభతరం చేసేందుకు ఈ ఫ్లైఓవర్‌కు మూడు ప్రాంతాల్లో అప్ ర్యాంపులు, రెండు ప్రాంతాల్లో డౌన్ ర్యాంపులను రెండు లైన్ల వెడల్పుతో డిజైన్ చేశారు.

  • అప్ ర్యాంపులు (Up Ramps): తాజ్ డెక్కన్ హోటల్, మాసబ్ ట్యాంక్, మరియు సరోజిని దేవీ కంటి ఆసుపత్రి సమీపంలో ఫ్లైఓవర్ ఎక్కేందుకు వీలుగా అప్ ర్యాంపులు నిర్మిస్తారు.
  • డౌన్ ర్యాంపులు (Down Ramps): బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 మరియు ఆసిఫ్ నగర్ రోడ్డు వైపు వాహనాలు కిందకు దిగడానికి డౌన్ ర్యాంపులను ఏర్పాటు చేస్తారు.

వర్షం పడితే గంటల తరబడి జామ్‌లకు చెక్!
ప్రస్తుతం పీక్ అవర్స్‌లో (ఉదయం, సాయంత్రం వేళల్లో) ఈ రూట్లో ప్రయాణించాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా తాజ్ కృష్ణా హోటల్, కేర్ ఆస్పత్రి, పెన్షన్ ఆఫీస్, ఎన్‌ఎండీసీ (NMDC) ఏరియాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతోంది. కేవలం 3 కిలోమీటర్ల దూరం దాటడానికి గంట పడుతున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ కొత్త ఫోర్-లేన్ రహదారి అందుబాటులోకి వస్తే, పంజాగుట్ట వైపు నుంచి మెహిదీపట్నం, రాజేంద్రనగర్ వైపు వెళ్లే వారికి సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ లభిస్తుంది. దీనితో పాటు, బంజారాహిల్స్ నుంచి విజయ్ నగర్ కాలనీ వైపు వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన నాలుగు లైన్ల అండర్ పాస్ (Underpass) నిర్మించాలని కూడా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రెండేళ్ల డెడ్‌లైన్.. త్వరలోనే టెండర్లు!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు హెచ్‌ఎండీఏ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) మరియు సమగ్ర ట్రాఫిక్ సర్వేలు శరవేగంగా జరుగుతున్నాయి. డీపీఆర్ సిద్ధమైన వెంటనే దీనిని ప్రభుత్వ అనుమతి కోసం పంపనున్నారు.

ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించనున్నారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి రెండేళ్ల కాలపరిమితిలో (2 Years Deadline) ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1. కొత్త ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారు?

ఈ కొత్త నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని జీవీకే వన్ మాల్ వద్ద ప్రారంభమై, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నంలోని పీపీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు నిర్మించబడుతుంది.

Q2. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయాణికులకు కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి?

ఈ కారిడార్ వల్ల పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయి వేగంగా చేరుకునే అవకాశం లభిస్తుంది. తాజ్ కృష్ణా, కేర్ హాస్పిటల్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

Q3. ఈ ఫ్లైఓవర్ పొడవు ఎంత? దీనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది?

ఈ ఎలివేటెడ్ కారిడార్ పొడవు సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చి పనులు ప్రారంభమైన తర్వాత రెండేళ్లలో (2 Years) ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ డెడ్‌లైన్ పెట్టుకుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »