విద్యా వ్యవస్థలో పెరుగుతున్న ఒత్తిడి, అనధికార కోచింగ్ సెంటర్ల పెరుగుదలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు “ఏపీ కోచింగ్ సెంటర్ల నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనలు-2026” నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై రాష్ట్రంలో నడుస్తున్న ప్రతి ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే నడుస్తున్న సంస్థలు మూడు నెలల్లోపు నమోదు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు అనుమతులు లేకుండా అనేక కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లో రెగ్యులర్ తరగతులతో పాటు అనధికారికంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ
ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్, తనిఖీలు, అనుమతులు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. మీడియా కథనాలు, పోలీస్ రిపోర్టులు లేదా ఇతర సమాచారం ఆధారంగా సుమోటోగా తనిఖీలు చేపట్టే అధికారం కూడా ఈ కమిటీకి ఉంటుంది.
Also Read: ఐపీఎల్ 2026కి ముందు సీఎస్‌కేకు బిగ్ షాక్.. గాయంతో తొలి రెండు వారాలు ఎంఎస్ ధోనీ దూరం
కోచింగ్ సెంటర్లకు కీలక నిబంధనలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం:
- కోచింగ్ సెంటర్లు తాత్కాలిక భవనాల్లో నడపకూడదు
- రోజుకు గరిష్టంగా 5 గంటలకే క్లాసులు పరిమితం
- ఆదివారం తప్పనిసరిగా సెలవు
- స్కూల్, కాలేజీ సమయాల్లో కోచింగ్ నిర్వహణ నిషేధం
- ప్రతి సంస్థకు వెబ్‌సైట్ ఉండాలి; ఫీజులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల వివరాలు అందుబాటులో ఉంచాలి
విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై దృష్టి
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ..
- ఆత్మహత్యలు నివారించేందుకు స్ప్రింగ్ ఫ్యాన్లు ఏర్పాటు
- బాల్కనీ, టెర్రస్‌లకు యాక్సెస్ నియంత్రణ
- తప్పనిసరిగా మరుగుదొడ్లు, సరైన తరగతి గదులు
- ప్రతి కోచింగ్ సెంటర్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
- విద్యార్థులకు కౌన్సెలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంచడం
అంతేకాకుండా, విద్యార్థులను వేధించడం, ఫీజుల కోసం ఒత్తిడి చేయడం కఠినంగా నిషేధించారు. కోర్సు మధ్యలో వదిలేస్తే మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజులను తిరిగి ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవడం నిషేధించారు.
సిబ్బంది నియామకాలపై ఆంక్షలు
ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, రెగ్యులర్ లెక్చరర్లు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పనిచేయరాదు అని నిబంధనలు చెబుతున్నాయి.
ఉల్లంఘనలకు భారీ జరిమానాలు
నిబంధనలు పాటించకపోతే
- మొదటి తప్పిదానికి రూ.50,000 జరిమానా
- రెండోసారి రూ.1 లక్ష జరిమానా
- మూడోసారి రిజిస్ట్రేషన్ రద్దు
మొత్తంగా, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఈ కొత్త నిబంధనలు కీలకంగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల పనితీరులో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


