ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ ఆరా తీయకపోవడంపై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వడానికి నాగబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, మరో వారం రోజులలోపు ఆయన తిరిగి విధుల్లో చేరే అవకాశముందని తెలిపారు. డాక్టర్ల సూచనల మేరకు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.
నాగబాబు అసహనం..
అయితే సమావేశం ప్రారంభమైన వెంటనే స్థానిక జనసేన నేతలు తమ సమస్యలను ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరు సరిగా లేదని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోగ్యం గురించి ఒక్కరూ మాట్లాడకపోవడం నాగబాబుకు అసహనాన్ని కలిగించింది.
దీంతో ఆయన తీవ్రంగా స్పందిస్తూ, “నేను ఇక్కడికి వివాదాలు మాట్లాడటానికి రాలేదు. మీలో ఒక్కరైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగారా? ఈ నియోజకవర్గం కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. అలాంటి నాయకుడి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనే కనీస బాధ్యత కూడా లేదా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. నాగబాబు ఆగ్రహానికి అక్కడున్న నాయకులు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. అనంతరం తమ తప్పును గ్రహించి ఆయనకు క్షమాపణలు తెలిపారు.
రూ.600 కోట్లు ఖర్చు
ఈ సమావేశంలో పిఠాపురం అభివృద్ధిపై కూడా నాగబాబు స్పందించారు. గత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన వివాదంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
Did anyone care to check on #PawanKalyan’s health?#Nagababu questions #Janasena leaders strongly.
He made it clear he doesn’t want to discuss controversies and asked everyone to stop escalating the matter. pic.twitter.com/pKzmf4S49X
— Filmyscoops (@Filmyscoopss) April 23, 2026
ఇక వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ మరో వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకుని, త్వరలోనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు సమాచారం రావడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read:


