దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. “ఆపరేషన్ కగార్”లో భాగంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, పార్టీ సెక్రటరీ జనరల్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా మొత్తం 16 మంది తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దేవ్ జీ, రాజిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఆపరేషన్ కగార్-2ను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కర్రెగుట్ట ఆపరేషన్ ప్రభావం
ఇటీవల కర్రెగుట్ట ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పలువురు మావోయిస్టులు హతమయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, PLGA తొలి బెటాలియన్‌కు కీలక నేతగా పేరుగాంచిన మాడ్వి హిడ్మా గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయా?.. 14 కిమీ ఎలివేటెడ్ కారిడార్‌తో ఊరట దిశగా అడుగులు
ఇటీవల మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న పాక హనుమంతు కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సుదీర్ఘకాలం అండర్‌గ్రౌండ్‌లో ఉన్న బర్సే దేవా సహా మరికొందరు ప్రముఖులు హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చారు.
పెద్ద ఎత్తున లొంగిపోతున్న మావోయిస్ట్‌లు..
కొద్ది నెలల క్రితం 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 98 మంది మహిళా మావోయిస్టులు ఉండటం విశేషం. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత కూడా ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. మహారాష్ట్రలో కూడా వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస విధానాన్ని స్వీకరించారు.
తెలంగాణకు చెందిన నేతలు ఇంకా అండర్‌గ్రౌండ్‌లో
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నట్లు ఇటీవల డీజీపీ వెల్లడించారు. వీరిలో కేంద్ర కమిటీలో ఇద్దరు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో మరికొందరు కొనసాగుతున్నట్లు సమాచారం. దేవ్ జీ సరెండర్ మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. భవిష్యత్తులో మరింతమంది లొంగిపోయే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.