పిఠాపురం/అమరావతి: జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర కృషి ఫలితంగా పిఠాపురం రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడనుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పిఠాపురం స్టేషన్‌ను ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అభివృద్ధి పనుల కోసం ఏకంగా రూ. 37.25 కోట్లను కేటాయించింది.
ఆధ్యాత్మిక నగరానికి ఆధునిక హంగులు:
పిఠాపురం (Pithapuram)క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, అక్కడకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం స్టేషన్‌ను ఆధునీకరించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఢిల్లీ పర్యటనలో చర్చ: గత జనవరిలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయిన పవన్ కళ్యాణ్, పిఠాపురం స్టేషన్ దుస్థితిని వివరించారు. అక్కడ అపరిశుభ్రత, సౌకర్యాల కొరత గురించి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్న అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్రం సానుకూల స్పందన: పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ, తక్షణమే నిధులు మంజూరు చేస్తూ పిఠాపురాన్ని అమృత్ భారత్ జాబితాలో చేర్చింది.
ఏం మార్పులు రాబోతున్నాయి?
- మంజూరైన రూ. 37.25 కోట్లతో స్టేషన్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి:
- నూతన భవనం & ముఖద్వారం: స్టేషన్ భవనాన్ని, ప్రధాన ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తారు.
- దివ్యాంగులకు ప్రాధాన్యత: దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గదుల నిర్మాణం.
- మౌలిక వసతులు: అత్యాధునిక టాయిలెట్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి, వెయిటింగ్ షెల్టర్ల నిర్మాణం మరియు కేబులింగ్ పనులు చేపట్టనున్నారు.
కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం:
పిఠాపురం అభివృద్ధికి సహకరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి మరియు నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


