టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయనకు చెందిన సంస్థకు కాకినాడలో 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జీవో జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ నగరంలో ఫైవ్ స్టార్ స్థాయి హోటల్ నిర్మాణానికి 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 17ను విడుదల చేసింది.
ఈ భూమిని వర్మకు చెందిన ఎస్.వి.ఎస్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు కేటాయించారు. రూ.104 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. కాకినాడలో ఇప్పటికే ఉన్న హోటళ్లకు భిన్నంగా, తాజ్ హోటల్ స్థాయిలో సౌకర్యాలు కలిగిన హోటల్ నిర్మించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వర్మ త్యాగానికి ప్రతిఫలమా?
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ సమయంలో పిఠాపురం టిడిపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ విజయం కోసం కూడా ఆయన చాలా పనిచేశారు. ఫలితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకినాడలో హోటల్ నిర్మాణానికి భూమి కేటాయించడం వర్మ త్యాగానికి బదులుగా ఇచ్చిన నజరానా అనే చర్చలు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్నాయి.
Also Read: రణవీర్ సింగ్ ‘ధురంధర్: ది రివెంజ్’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఆశలు.. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పిఠాపురం ప్రాంతంలో మంచి పట్టున్న నాయకుడిగా వర్మకు పేరుంది. అదే సమయంలో టిడిపిలో రెబల్ నాయకుడిగా కూడా ఆయనను రాజకీయ వర్గాలు పేర్కొంటుంటాయి. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అవుతుందని చాలా మంది భావించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ దిశగా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో స్థానికంగా టిడిపి శ్రేణుల్లో కొంత అసంతృప్తి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
66 ఏళ్ల లీజుతో భూమి కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం, 2024-2029 టూరిజం పాలసీ కింద ఈ భూమిని 66 సంవత్సరాలపాటు లీజుకు ఇచ్చారు. ప్రాజెక్ట్ విజయవంతమైతే మరో 33 సంవత్సరాలు లీజు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్ విలువలో కేవలం ఒక్క శాతం మాత్రమే వార్షిక అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ అద్దెను 5 శాతం చొప్పున పెంచుతారు.
అదే విధంగా హోటల్ నిర్మాణం పూర్తైన తర్వాత 5 సంవత్సరాల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ కూడా అందించనున్నారు. సంస్థ పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే వరకు స్టేట్ జీఎస్టీని కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించే విధానం అమల్లో ఉంటుంది.
పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి..
కాకినాడను పెన్షనర్ల ప్యారడైజ్‌గా పిలుస్తారు. ప్రశాంతమైన నగరంగా పేరుగాంచిన ఈ ప్రాంతం ప్రస్తుతం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌తో వేగంగా అభివృద్ధి చెందుతోంది. పోర్టు ఆధారిత సేవలు పెరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలు, వ్యాపార సమావేశాలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు అనువైన పెద్ద హోటళ్లు అవసరం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కాకినాడను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం ద్వారా నగరానికి మరింత పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 300 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎస్.వి.ఎస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాకినాడ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ప్రాంతంలో ఈ హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు.


