టీటీడీ రూ.5,456 కోట్ల బడ్జెట్ ఆమోదం – రిలయన్స్ రూ.120 కోట్లు విరాళం, UPI ముడుపు పత్రం తాజా షాకింగ్ నిర్ణయాలు!

టీటీడీ 2026–27 బడ్జెట్‌కు ఆమోదం లభించింది. భక్తుల సౌకర్యం, డిజిటల్ సేవలు, భద్రత, విద్య, అన్నప్రసాదం, కొత్త ఆలయాల నిర్మాణాలకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TTD Budget 2026 Approved
TTD Budget 2026 Approved

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఈరోజు అధికారికంగా ఆమోదం తెలిపింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల సౌకర్యం, పారదర్శకత, ఆధ్యాత్మిక వైభవం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కోసం రూ.118.89 కోట్లు కేటాయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భక్తులకు కొత్త సదుపాయాలు – UPI ముడుపు పత్రం

శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయించారు. భక్తులు UPI ద్వారా చెల్లించి ముడుపు పత్రం తీసుకుని నేరుగా హుండీలో సమర్పించే సౌకర్యం కల్పించారు. ఇది డిజిటల్ పేమెంట్ విధానంలో భక్తులకు అనుకూలంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్‌రే స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు, సత్రాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల భద్రత పర్యవేక్షణకు తిరుపతిలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

రిలయన్స్ విరాళం, కొత్త అన్న ప్రసాద భవనం

తిరుమలలో అదనంగా అన్న ప్రసాద భవనం, ఆధునిక వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థ రూ.100-120 కోట్లు విరాళం ఇవ్వనున్నది. ఈ పనులకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం కోసం డ్రై ఐల్యాండ్ నిర్మాణానికి రూ.20.17 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్ర నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయించారు. కోయంబత్తూరు, గువహటి, బెలగావి, పాట్నా సమీప మోకామా నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన భూములు స్వీకరించేందుకు ఆమోదం తెలిపారు.

భక్తులకు ప్రత్యేక ప్రసాదం, సోషల్ మీడియా హెచ్చరిక

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే 70 వేల మంది భక్తులకు ఉచితంగా తిరుమల లడ్డూ ప్రసాదం అందిస్తారు. వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356, తిరుమలలో 371 భద్రతా సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. తిరుమలలో అసత్య కథనాలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ తాజాగా హెచ్చరించింది.

ఇంకా చదవండి : UPI చెల్లింపులకు ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్.. PhonePe కొత్త ఫీచర్

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »