తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. తెలంగాణ భక్తురాలికి కాటు, నిలకడగా ఆరోగ్యం

తిరుమలలో రూ.300 దర్శన క్యూలైన్‌లో పాము ప్రవేశించి కలకలం రేపింది. తెలంగాణకు చెందిన మౌనిక అనే భక్తురాలిని పాము కాటేయగా, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

TTD darshan queue line

తిరుమలలో నిత్యం భ‌క్తుల ర‌ద్ధీ ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే భక్తులు దర్శనానికి వెళ్లే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్‌లో పాము ప్రవేశించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ఈ ఘటనలో తెలంగాణకు చెందిన మౌనిక అనే యువతిని పాము కాటేయడంతో కలకలం రేగింది.వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది బాధితురాలిని క్యూ లైన్ వద్ద నుంచి తొలగించి తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి పంపించారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆమె స్వస్థలం భూపాలపల్లి అని సమాచారం.

భ‌యాందోళ‌న‌లు..

భక్తులు భారీగా తరలివస్తున్న సమయంలో క్యూలైన్‌లోకి పాము ప్రవేశించడం భక్తుల్లో భయాందోళనలు కలిగించింది. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, తిరుమలలో శ్రీ అనంతాళ్వార్ 972వ అవతార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Also Read: రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం.. ఇద్దరు మృతి, 13 మంది ఆసుప‌త్రిలో..

ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) డాక్టర్ ఏ. శరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ స్థానమున్న అనంతాళ్వార్ జీవితం భక్తులకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.

అనంతాళ్వార్ వంశీకులు “నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమలలో రామానుజుల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, సహస్రనామార్చన, జీయర్ మఠం స్థాపన వంటి అంశాలపై పండితులు ఉపన్యాసాలు చేశారు.

టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలన

తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని జేఈవో డాక్టర్ ఏ. శరత్ పరిశీలించారు. తయారీ విధానం, నాణ్యత ప్రమాణాలు, ప్యాకేజింగ్ తదితర అంశాలను సమీక్షించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సువాసనలతో ఆరు రకాల అగరబత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరిన్ని రకాల అగరబత్తులను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎస్వీ గోశాలను పరిశీలించి గోవులకు సమయానికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »