హైదరాబాద్: పసిడి ప్రియులకు ఇది నిజంగానే మంచి అవకాశం. గత రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 1,000 కి పైగా ధర తగ్గడం గమనార్హం. వెండి ధర కూడా నిన్నటి భారీ తగ్గుదల తర్వాత ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరల వివరాలు:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర ఈరోజు మరో రూ. 540 తగ్గి, రూ. 1,54,750 వద్ద కొనసాగుతోంది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 500 తగ్గి, ప్రస్తుతం రూ. 1,41,850 వద్దకు చేరుకుంది.
ఇక వెండి విషయానికి వస్తే.. క్రితం సెషన్‌లో ఏకంగా రూ. 5,000 మేర పతనమైన కిలో వెండి ధర, నేడు మార్పు లేకుండా రూ. 2,75,000 వద్ద స్థిరంగా ఉంది.
ధరలు తగ్గడానికి కారణాలు:
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 4,755 డాలర్ల వద్ద ట్రేడవుతూ కొంత పెరుగుదల కనబరుస్తున్నప్పటికీ, దేశీయంగా మాత్రం తగ్గుదల నమోదైంది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడి ప్రకటనలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంత సడలడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. అయితే, అంతర్జాతీయంగా ధరలు మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా ఈ ప్రభావం ఉండవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read:

