హైదరాబాద్: ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ (ఆర్పీఎస్జీ)కి చెందిన పునరుత్పాదక ఇంధన ప్లాట్‌ఫారమ్ ‘పూర్వా గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్’ (Purvah Green Power Private Limited) ఒక కీలక ఒప్పందాన్ని ప్రకటించింది. రాజస్థాన్ , కర్ణాటకలోని ఆరు ప్రాజెక్ట్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ పరిధిలో ఉన్న 1.4 గిగావాట్ల (GWp) ఆపరేటింగ్ సోలార్ పోర్టఫోలియోను ‘రెన్యూ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి రూ. 4,859 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువకు (USD 509 మిలియన్లు) కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మాతృ సంస్థ నిధులతో ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. భారతీయ మార్కెట్లో ఆపరేటింగ్ సోలార్ ఆస్తులకు సంబంధించి జరిగిన అతిపెద్ద కొనుగోళ్లలో ఇది ఒకటిగా నిలిచింది.
ఒప్పందం ముఖ్యాంశాలు:
స్థిరమైన ఆదాయం: కొనుగోలు చేసిన ఈ సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ఉత్పత్తిని ఇస్తూ మంచి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో 90 శాతానికి పైగా సామర్థ్యం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPAs) కలిగి ఉండగా, మిగిలిన భాగం కర్ణాటక డిస్కమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పీపీఏలన్నీ 25 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉన్నాయి.
పెరిగిన సామర్థ్యం: ఈ కొనుగోలుకు ముందు పూర్వా సంస్థ contracted సామర్థ్యం సుమారు 3.4 GWpగా ఉండగా, ఈ ఒప్పందంతో అది మొత్తం 4.8 GWpకి చేరింది. ఇందులో 1.8 GWp ఆపరేషనల్‌గా ఉండగా, 3 GWp వివిధ నిర్మాణ దశలలో ఉంది. దీనితో పాటు 2.2 GWh బ్యాటరీ సామర్థ్యం కూడా అమల్లో ఉంది.
భవిష్యత్ లక్ష్యాలు: రాబోయే కొన్ని సంవత్సరాలలో 10 GW పునరుత్పాదక ఇంధన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాలనే తమ గ్రూప్ లక్ష్యానికి ఈ కొనుగోలు ఊతమిస్తుందని ఆర్పీఎస్జీ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా తెలిపారు. సాంప్రదాయ విద్యుత్ రంగం నుంచి వైవిధ్యభితమైన ఇంధన వేదికగా మారడంలో ఇదొక కీలక అడుగు అని పేర్కొన్నారు.