షేర్ హోల్డ‌ర్స్‌కి రెండు శుభ‌వార్త‌లు చెప్పిన టాటా కంపెనీ.. 1:2 రేషియోలో బోనస్ షేర్లు

టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ సంస్థ క్యూ4లో లాభాలను గణనీయంగా పెంచుకుంది. 1:2 బోనస్ షేర్లు, 600% డివిడెండ్ ప్రకటిస్తూ ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.

షేర్ హోల్డ‌ర్స్‌కి రెండు శుభ‌వార్త‌లు చెప్పిన టాటా కంపెనీ
షేర్ హోల్డ‌ర్స్‌కి రెండు శుభ‌వార్త‌లు చెప్పిన టాటా కంపెనీ

భారతదేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ తన క్యూ4 ఫలితాలను ప్రకటించింది. జుడియో, వెస్ట్‌సైడ్ వంటి ప్రముఖ రిటైల్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ బుధవారం మార్కెట్ అవర్స్ ముగిసిన తర్వాత ఫలితాలను వెల్లడించింది. ట్రెంట్‌కు జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 413.10 కోట్లుగా నమోదైంది.

గత ఏడాది ఇదే కాలంలో రూ. 311.60 కోట్లుగా ఉన్న లాభంతో పోలిస్తే ఇది 32.57 శాతం వృద్ధిని సూచిస్తోంది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం కూడా 19.23 శాతం పెరిగి రూ. 5027.99 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం రూ. 5055.90 కోట్లుగా నమోదైంది. అయితే వ్యయాలు కూడా 16.7 శాతం పెరిగి రూ. 4520.95 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.

షేర్‌హోల్డర్లకు బోనస్ షేర్లు

ఫలితాలతో పాటు ట్రెంట్ బోర్డు షేర్‌హోల్డర్లకు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ప్రతి రెండు షేర్లకు ఒక అదనపు షేరు లభిస్తుంది. ఉదాహరణకు 100 షేర్లు ఉన్న ఇన్వెస్టర్‌కు మరో 50 షేర్లు ఉచితంగా అందుతాయి. రికార్డ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం కంపెనీకి సుమారు 5 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఉన్నారు. ఇదే సమయంలో ట్రెంట్ షేర్‌హోల్డర్లకు డివిడెండ్ కూడా ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ. 6 చొప్పున డివిడెండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది సుమారు 600 శాతం డివిడెండ్‌గా పరిగణించబడుతుంది.

స్టాక్ పనితీరు

ట్రెంట్ షేర్ గత కొంతకాలంగా ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. గరిష్ఠ స్థాయి నుంచి 50 శాతం వరకు పతనం అయినప్పటికీ, ఇటీవల కొంతమేర కోలుకుంది. ఏప్రిల్ 22న ఫలితాల నేపథ్యంలో స్వల్ప లాభంతో రూ. 4,409.90 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 1.58 లక్షల కోట్లుగా ఉంది.

52 వారాల గరిష్ఠ ధర రూ. 6,261 కాగా, కనిష్ఠ ధర రూ. 3,275.50గా నమోదైంది. గత నెలలో స్టాక్ దాదాపు 31 శాతం వరకు పుంజుకోవడం ఇన్వెస్టర్లలో మళ్లీ ఆసక్తి పెరుగుతున్నట్లు సూచిస్తోంది. మొత్తంగా, బలమైన క్యూ4 ఫలితాలు, బోనస్ షేర్లు, భారీ డివిడెండ్ ప్రకటనలతో ట్రెంట్ ఇన్వెస్టర్లకు డబుల్ గుడ్‌న్యూస్ అందించింది.
Also Read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »