హైదరాబాద్: జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన చిన్ననాటి సంగీత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పవన్ కల్యాణ్‌తో తనకున్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఏడేళ్ల వయసులోనే స్టేజ్ పెర్ఫార్మెన్స్:
తను ఏడేళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటోను షేర్ చేస్తూ అన్నా కొణిదెల తన స్మృతులను నెమరువేసుకున్నారు. “ఈ ఫొటోలో ఉన్న చిన్నారి నేనే. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నా మ్యూజిక్ స్కూల్ వేదికపై నిల్చున్న క్షణమిది. అప్పుడు బీథోవెన్ స్వరపరిచిన ‘లా మర్మోట్’ వాయించాను. అప్పటికి నా చేతులు చాలా చిన్నవి. నా టీచర్ పక్కనే ఉండి నాకు సహకరించారు” అని ఆమె పేర్కొన్నారు.
వయోలిన్ టు పియానో: 15 ఏళ్ల సాధన
సంగీతం తన జీవితంలో ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుందో వివరిస్తూ.. “నేను ఐదేళ్ల వయసు నుంచే వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించాను. 15 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు నిరంతరం మ్యూజిక్ స్కూల్‌కు వెళ్లాను. వృత్తిపరంగా నేను సంగీతాన్ని ఎంచుకోకపోయినా, క్లాసికల్ మ్యూజిక్ ఎప్పుడూ నా అంతర్భాగంగానే ఉంటుంది” అని అన్నా వెల్లడించారు.
Also Read : ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న చేసిన సాయం జీవితంలో మరిచిపోలేను.. నారా లోకేష్ కామెంట్స్ వైరల్
భర్త పవన్ ఇచ్చిన ప్రత్యేక కానుక:
భారతదేశానికి వచ్చిన తర్వాత తన భర్త పవన్ కల్యాణ్ తన అభిరుచిని గుర్తించి, తన కోసం ఒక పియానో కొనిచ్చారని అన్నా కొణిదెల ఆనందం వ్యక్తం చేశారు. “నా వయోలిన్ కూడా ఇక్కడే ఉంది. కానీ కొంతకాలంగా వాటిని వాయించాలని అనిపించడం లేదు. నాలోని సంగీతం బహుశా సరైన సమయం కోసం వేచి చూస్తోంది. త్వరలోనే మళ్లీ వినిపిస్తుందని ఆశిస్తున్నాను” అని మనసులోని మాటను పంచుకున్నారు.
సంగీతం ఒక విశ్వజనీన భాష:
సంగీతం గురించి ఆమె గొప్పగా చెబుతూ.. “సంగీతానికి భాష, ప్రాంతం అనే భేదాలు లేవు. మాటలు లేకుండానే నొప్పిని, ప్రేమను, ఆనందాన్ని పంచుకోగలిగే శక్తి సంగీతానికి ఉంది. ఇది వేర్వేరు సంస్కృతుల మధ్య వారధిగా పనిచేస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో అన్నా కొణిదెల సందడి:
ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన అన్నా కొణిదెలకు పవన్ కల్యాణ్ స్వయంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియా ఉనికి స్ఫూర్తిదాయకమైన చర్చలకు దారి తీయాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు అన్నా తన వ్యక్తిగత విషయాలను, అభిరుచులను పంచుకుంటూ మెగా అభిమానులకు మరింత చేరువవుతున్నారు.
Also Read :జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు… మహిళా కమిషన్ స్పందన, ఎమ్మెల్యే కౌంటర్


