నిర్మాతల మండలి ఎన్నికల వేళ సి.కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్డ్, చిన్న నిర్మాతల అంశాలపై ఆరోపణలు చేశారు.

producers-council-elections-c-kalyan-sensational-comments
producers-council-elections-c-kalyan-sensational-comments

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. మన ప్యానెల్ తరఫున సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ మీడియాతో మాట్లాడారు. నిర్మాతల మండలి, గిల్డ్ వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

సి.కళ్యాణ్ ఏమన్నారంటే..

ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని సి.కళ్యాణ్ తెలిపారు. నిన్న కొన్ని హామీలు, వాగ్దానాలు చేసినట్లు చూశామని.. తాము అలాంటివేమీ చేయలేదన్నారు. ఎందుకంటే తాము చేసిన పనులు అందరికీ కనిపిస్తున్నాయని చెప్పారు.

నిర్మాతల మండలికి చెందిన కౌన్సిల్‌ను గండి కొట్టి గిల్డ్‌కు తీసుకెళ్లి ఆ సొమ్మును ఎవరు అనుభవిస్తున్నారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తమవాళ్లు ఏడుగురు ఉంటే.. అవతలి వర్గానికి 16 మంది ఉన్నారని, గత రెండున్నరేళ్లుగా వారు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వచ్చి సేవలు చేస్తామని హామీలు, వాగ్దానాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీశారు.

అధికారంలో ఉన్నప్పటికీ నిర్మాతలకు సహాయంగా నిలబడలేదని ఆరోపించారు. నిర్మాతల మండలి ఒక ఛారిటీ సంస్థ అని, తాను మద్రాస్ నుంచి హైదరాబాద్ వరకు పరిశ్రమతో కలిసి వచ్చిన వ్యక్తినని చెప్పారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

గిల్డ్ వారు నిర్మాతల మండలికి అన్యాయం చేశారని సి.కళ్యాణ్ ఆరోపించారు. చిన్న సినిమాల వల్ల 40 వేల మంది జీవిస్తున్నారని, వారి కోసం పనిచేసేది నిర్మాతల మండలేనని అన్నారు. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి తమ ప్యానెల్ ఉందని స్పష్టం చేశారు.

ఒక నిర్మాత సినిమా చేసిన వెంటనే మెడిక్లెయిమ్ వచ్చేలా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత తాను ప్రెసిడెంట్‌గా అందరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

గిల్డ్‌లో ఉన్నవారు కోట్ల రూపాయల సొమ్మును దుర్వినియోగం చేశారని సి.కళ్యాణ్ ఆరోపించారు. తాము దుర్వినియోగం చేశామని ఎవరైనా నిరూపిస్తే వెంటనే సమాధానం చెబుతామని అన్నారు. చిన్న సినిమాలకు వారు చాలా అన్యాయం చేశారని, పేద నిర్మాతలకు ఇచ్చే డబ్బును గిల్డ్‌లో వారిలో వారే పంచుకున్నారని ఆరోపించారు.

తమ ప్యానెల్‌లో ఉన్న వారిపై బ్లాక్ డాట్ చూపిస్తే వెంటనే వైదొలుగుతానని కూడా సి.కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సంస్థను పూర్తిగా ఉపయోగించుకునేది వారేనని, వారిలో వారికే ఐక్యత ఉండదని అన్నారు.

ఏడాదికి సుమారు 300 చిన్న సినిమాలు వస్తున్నాయని, ఆ సినిమాలపై ఆధారపడి పనిచేసే వారు బాగుండాలంటే చిన్న నిర్మాతలు బాగుండాలని సి.కళ్యాణ్ పేర్కొన్నారు.

పరిశ్రమను ధర్మంగా ముందుకు నడిపిస్తాం: చదలవాడ

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 1990లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పెద్ద నిర్మాతలు చాలామంది లేరన్నారు. పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సహకరించారని గుర్తు చేశారు.

సి.కళ్యాణ్ ఉన్నత వ్యక్తి అని, ప్రసన్నకుమార్ నిలకడగా ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. నిర్మాతల సొమ్మును గిల్డ్‌కు తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. తాము కౌన్సిల్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలను అందరికీ అర్థమయ్యేలా వెల్లడిస్తామని చెప్పారు.

మన ప్యానెల్‌ను పూర్తి మెజారిటీతో గెలిపించాలని నిర్మాతలను కోరారు. చిత్ర పరిశ్రమను ధర్మంగా ముందుకు నడిపించే బాధ్యత తమదేనని, పరిశ్రమలో అందరూ బాగుండేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

చిన్న నిర్మాతలకు అండగా ఉన్నాం: ప్రసన్నకుమార్

తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నికల సమయంలో తమను మోసం చేశారని ఆరోపించారు. తాను గతంలో ఎంతోమంది చిన్న నిర్మాతలకు అండగా నిలిచానని చెప్పారు.

ఇన్సూరెన్స్ ఎవరెవరికి ఇచ్చారనే విషయం స్పష్టంగా ఉందన్నారు. గిల్డ్‌కు సంబంధించిన సమస్యలను కూడా కౌన్సిల్ పరిష్కరించిందని తెలిపారు. ఎన్నో పెద్ద సినిమాలకు కూడా తాము అండగా నిలిచామని చెప్పారు.

చిత్ర పరిశ్రమ, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల కోసం పనిచేసేది తామేనని ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. దానయ్య, సునీల్ నారంగ్, వంశీ నందిపాటి వంటి నిర్మాతలు మంచి సినిమాలు చేస్తూ కౌన్సిల్‌తో నిలబడ్డారని తెలిపారు.

అవతలి ప్యానెల్‌లో ఉన్నవారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని.. తాము మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రభుత్వాల పరంగా కూడా పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నామని ప్రసన్నకుమార్ తెలిపారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »