జనసేన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు… మహిళా కమిషన్ స్పందన, ఎమ్మెల్యే కౌంటర్

వైరల్ అవుతున్న వీడియోలో బాధిత మహిళ మాట్లాడుతూ, ఎమ్మెల్యే శ్రీధర్ తనను మొదట ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించారని... తనకు ఇష్టం లేకపోయినా బెదిరింపుల ద్వారా లొంగదీసుకున్నారని, బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు.

Allegations Against Arava Sridhar
  • జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం ఏర్పడింది.

  •  ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుని బాధితురాలితో మాట్లాడి సమగ్ర విచారణ చేపడతామని భరోసా ఇచ్చింది.

  •  తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఖండిస్తూ, ఇవన్నీ తప్పుడు ప్రచారమని పేర్కొని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపే పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకుంటున్న మహిళ, ఎమ్మెల్యే తనను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు లైంగికంగా వేధించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, వాట్సాప్ చాట్‌లు, రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో బాధిత మహిళ మాట్లాడుతూ, ఎమ్మెల్యే శ్రీధర్ తనను మొదట ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించారని, ఆ తర్వాత క్రమంగా తనపై ఒత్తిడి పెంచారని పేర్కొన్నారు. తనకు ఇష్టం లేకపోయినా బెదిరింపుల ద్వారా లొంగదీసుకున్నారని, బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం కారణంగా తాను గర్భవతి అయ్యానని, అయితే తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని కూడా ఆమె ఆరోపణల్లో పేర్కొన్నారు.

ఆ మహిళ చేసిన ప్రధాన ఆరోపణలు ఇలా ఉన్నాయి:

ఎమ్మెల్యే శ్రీధర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపణ

బలవంతపు సంబంధం వల్ల తాను గర్భవతి అయ్యానని, గర్భస్రావానికి గురయ్యానని ఆవేదన

తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణ

డిమాండ్లకు ఒప్పుకోకపోతే తన మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరించారని ఆరోపణ

ఈ అంశంపై రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వీడియోలను పోస్టు చేస్తూ, ఎమ్మెల్యే శ్రీధర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై పోలీసులకు అధికారిక ఫిర్యాదు అందలేదని సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ, రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను కమిషన్ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చినట్లు చెప్పారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను మహిళా కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు.

ఆయన విడుదల చేసిన వీడియోలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

కొందరు డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు కంటెంట్ ద్వారా తన పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు

తనపై సాగుతున్న దుష్ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను

ఈ ఆరోపణలకు న్యాయస్థానంలో సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారి తీస్తుండటంతో, విచారణలో వెలువడే నిజాలు ఏంటన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »