చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తాజాగా ఉపసంహరించుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసుకు తాత్కాలికంగా ముగింపు పలికింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత.. తమ దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తమ మధ్య ఉన్న విభేదాలు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే భరణం ఇవ్వాలని, చెన్నైలోని నీలంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి కల్పించాలని కూడా కోర్టును కోరారు.
పలుమార్లు వాయిదా పడిన విచారణ
విడాకుల కేసు విచారణ పలుమార్లు వాయిదా పడింది. గత నెల జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకాకపోగా, వారి తరఫు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు తెలిపారు. అనంతరం విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు.
కోర్టులో పిటిషన్ ఉపసంహరణ
తాజా విచారణ సందర్భంగా సంగీత తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు, పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో కేసును “విత్‌డ్రాన్” గా పరిగణిస్తూ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాది కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే భవిష్యత్తులో అవసరమైతే కొత్తగా మరో పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ సంగీతకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
1999లో వివాహం.. ఇద్దరు పిల్లలు
విజయ్, సంగీతలు 1999లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో చురుగ్గా మారిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచూ వార్తల్లో నిలిచాయి.
సంచలనం సృష్టించిన ఆరోపణలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసిన పిటిషన్‌లో సంగీత పలు సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం 2021లోనే తనకు తెలిసిందని పేర్కొన్నారు.
ఆ సంబంధాన్ని విరమిస్తానని హామీ ఇచ్చినప్పటికీ కొనసాగించారని, తనను సామాజికంగా, వృత్తిపరంగా దూరం పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా సదరు నటితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం, తనపై ఆర్థిక ఆంక్షలు విధించడం, రాకపోకలపై పరిమితులు పెట్టడం వంటి చర్యలతో తనను, తమ ఇద్దరు పిల్లలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తమ వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిందని అప్పట్లో పేర్కొన్న సంగీత.. ఇప్పుడు అదే కేసును ఉపసంహరించుకోవడం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఆమె నిర్ణయానికి గల కారణాలపై ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.


