బల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం.. జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించడంపై ఆగ్రహం..!

తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly)లో జరిగిన బలపరీక్షలో సీఎం విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంది. డీఎంకే (DMK) ఓటింగ్‌ను బహిష్కరించింది. దాంతో టీవీకేకు పరిస్థితి అనుకూలంగా మారింది. మిత్రపక్షాలతో పాటు అన్నాడీఎంకే రెబల్‌ నేతలు మద్దతు ప్రకటించారు.

Tamil Nadu | తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి విజయ్‌ ప్రభుత్వం విజయవంతంగా గట్టెక్కింది. అధికార టీవీకే ప్రభుత్వానికి సభలో స్పష్టమైన మద్దతు లభించింది. బలపరీక్ష సందర్భంగా 144 మంది సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా.. 22 మంది వ్యతిరేకంగా నిలిచారు. ఈసారి సభలో మూజువాణి ఓటు కాకుండా, ప్రతి సభ్యుడి అభిప్రాయాన్ని స్పీకర్ వ్యక్తిగతంగా నమోదు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. సభ్యుల పేర్లు పిలుస్తూ మద్దతు తెలుపుతున్నారా.. వ్యతిరేకిస్తున్నారా? అంటూ అడగడం విశేషం. ప్రభుత్వానికి కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ సభ్యులు మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేకు చెందిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం విశ్వాస పరీక్షను బహిష్కరించింది. పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో సభలో మొత్తం సంఖ్య తగ్గింది. దాంతో మెజారిటీకి అవసరమైన సంఖ్య కూడా తగ్గిపోవడంతో అధికార పక్షానికి పరిస్థితి మరింత అనుకూలంగా మారింది.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

విజయ్‌ ఏమన్నారంటే..

విశ్వాస పరీక్ష అనంతరం సభలో మాట్లాడిన సీఎం విజయ్, తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజల విశ్వాసంతోనే అధికారంలోకి వచ్చామని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. తమకు మద్దతు తెలిపిన ప్రతి పార్టీకి, ప్రతి సభ్యుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీవీకేకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ నేత వేలుమణి స్పందించారు. తమ మద్దతుకు ప్రతిఫలంగా ఎలాంటి పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు. దీనిపై సీఎం విజయ్ స్పందిస్తూ, రాజకీయ మద్దతు కోసం ప్రలోభాల రాజకీయాలు తమ విధానం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ వర్గం విజయ్ ప్రభుత్వాన్ని అంగీకరించలేదని అన్నారు. విశ్వాస పరీక్ష సమయంలో మద్దతు కూడగట్టే క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు. గత డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Read Also : అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్‌..!

జ్యోతిషుడి నియామకంపై మండిపాటు..

అసెంబ్లీలో బల నిరూపనకు ముందు విజయ్‌ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రత్యేక అధికారి (ఓఎస్‌డీ)గా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని అసెంబ్లీలో డీఎంకే నేత ప్రేమలత విజయకాంత్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యక్తిగతంగా జ్యోతిష్యుడిపై నమ్మకం ఉండొచ్చని, కానీ ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి నియామకాలు సరైన సందేశాన్ని ఇవ్వవన్నారు. ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే సంకేతంగా మారే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విజయ్ ఘన విజయం సాధిస్తారని వెట్రివేల్ ముందే చెప్పినట్టు తమిళనాట తెగ ప్రచారం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సైతం ఆయన సూచించిన ముహూర్తానికి సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేయడంతో బాధ్యతలు స్వీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వివాదంపై బీజేపీ భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. బీజేపీ నేత వినోజ్‌ సెల్వం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు నమ్మకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం సహజమని అన్నారు. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడాన్ని ప్రజలు అంగీకరిస్తే, జ్యోతిష్యుడికి పరిపాలనా బాధ్యత ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించారు. సీఎం నిర్ణయానికి రాజకీయ రంగు పులమడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Read Also : బంగారం కొనుగోలుదారులకు షాక్‌..! దిగుమతులపై సుంకం 15 శాతానికి పెంపు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »