-
ఎల్లమ్మ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం
-
నెలకు 10 రోజులు మాత్రమే కేటాయించే ప్రత్యేక ఒప్పందం
-
బలగం దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న గ్రామీణ కథ
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. ‘బలగం’ చిత్రంతో సంచలనం సృష్టించిన వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్నారు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం నెలలో కేవలం పది రోజులు మాత్రమే కేటాయించేలా నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ స్వయంగా వెల్లడించారు.
Also Read: Kalki 2898 AD సీక్వెల్ గ్రాండ్ స్టార్ట్.. శంకర్‌పల్లిలో భారీ సెట్స్
నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ప్లాన్ చేశారు. అయితే, తన తండ్రి మరణించడంతో ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేకపోయానని, అందుకే అది ఆగిపోయిందని డీఎస్పీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సుకుమార్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు వంటి వారు తనను ఎప్పటినుంచో నటన వైపు ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ చిత్రంతో ఆయన నటుడిగా మారాలన్న కల నెరవేరుతోంది. గ్రామీణ నేపథ్యంలో దైవిక అంశాలతో ముడిపడిన ఈ కథలో డీఎస్పీ ఒక డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా గురించి దేవిశ్రీ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత దిల్ రాజు నన్ను సంప్రదించి, ఈ సినిమా కోసం నెలలో పది రోజులు కేటాయిస్తే చాలని, మిగిలిన సమయంలో నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చారు. సంగీత దర్శకుడిగా నా తొలి సినిమా ‘దేవి’. ఇప్పుడు నటుడిగా మరో దేవత పేరున్న ‘ఎల్లమ్మ’ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తుండటం విశేషం.
