హైదరాబాద్: వరల్డ్ లివర్ డే 2026 సందర్భంగా లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్ హాస్పిటల్ “Ride for a Cause” పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీ నగరం దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 19న నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా కాలేయ వ్యాధుల నివారణకు ఆరోగ్యకరమైన అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆరోగ్య సంస్థలు పిలుపునిచ్చిన “సాలిడ్ హ్యాబిట్స్, స్ట్రాంగ్ లివర్” నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో నగరం నలుమూలల నుండి వచ్చిన బైకర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బైకర్లలో ఉత్సాహాన్ని నింపారు. లక్డీకాపూల్ గ్లెనెగల్స్ హాస్పిటల్ నుండి మొదలైన ఈ ప్రయాణం నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. హెల్మెట్లు ధరించిన రైడర్లు కాలేయ రక్షణపై అవగాహన కల్పించే జెండాలతో సందడి చేశారు. వ్యాయామం, సరైన ఆహారం మద్యపాన నియంత్రణ ద్వారా కాలేయాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కావ్య హారిక దెందుకూరి, డాక్టర్ తరుణ్ గట్టు ఇతర నిపుణులు ప్రాథమిక దశలోనే కాలేయ సమస్యలను గుర్తించడంపై అవగాహన కల్పించారు.
హాస్పిటల్ రీజినల్ సీఈఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ, చెన్నై హైదరాబాద్‌లోని గ్లెనెగల్స్ హాస్పిటల్స్ ప్రజారోగ్యం కోసం ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ భరత్ ఎం మాట్లాడుతూ, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న కాలేయ సమస్యలను నివారించడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచించారు. జీఎం కూర మురళీధర్ రైడర్ల క్రమశిక్షణను అభినందించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారికి ఫ్యాటీ లివర్, ఊబకాయం వైరల్ హెపటైటిస్ గురించి కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కమ్యూనిటీ కార్యక్రమాలు చేపడతామని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది.