Digital arrest : హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం – రిటైర్డ్ జడ్జి నుంచి ₹1.66 కోట్లు దోపిడి

Digital arrest : హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ సంచలనం. సీబీఐ పేరుతో బెదిరించి రిటైర్డ్ జడ్జి నుంచి రూ.1.66 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు. పూర్తి వివరాలు చదవండి.

Digital arrest
Digital arrest

హైదరాబాద్:

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ (Digital arrest)పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారులు అని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు, నేరెడ్‌మెట్ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ న్యాయమూర్తిని బెదిరించి రూ.1.66 కోట్లు దోచుకున్నారు. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫిబ్రవరి 23న బాధితుడికి ఓ అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను సీనియర్ సీబీఐ అధికారి దీపక్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. “మీరు రెండు మొబైల్ ఫోన్లు వాడుతూ ఒక నంబర్ నుంచి మహిళతో అనుచితంగా మాట్లాడుతున్నారని, బెంగుళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో మీపై కేసు నమోదైంది” అంటూ బెదిరించాడు.

అంతేకాకుండా బాధితుడి ఆధార్ నంబర్‌తో ఎవరైనా సిమ్ కార్డు తీసుకుని దుర్వినియోగం చేసి ఉండొచ్చని చెప్పి అతనిని గందరగోళానికి గురిచేశాడు.

వీడియో కాల్‌తో భయపెట్టిన నేరగాళ్లు

కొద్ది సేపటికే మరో వ్యక్తి వీడియో కాల్ చేసి తాను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌరవ్ సారథి అని పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైందని, ఈ కేసులో సుప్రీంకోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని చెప్పి మరింత భయపెట్టాడు.

అంతేకాకుండా, “మీ ఆధార్ కార్డు దుర్వినియోగం జరిగిందని లేఖ రాసి కేసు విచారణకు సహకరిస్తానని పేర్కొనండి” అని సూచించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పవద్దని కూడా హెచ్చరించాడు.

సుప్రీంకోర్టు పేరుతో మోసం

తర్వాత మరో మహిళ వీడియో కాల్‌లో కనిపించి తాను సీనియర్ సీబీఐ అధికారి అర్చనా రామసుందరం అని చెప్పింది. సుప్రీంకోర్టు లోగో ఉన్న లేఖను చూపిస్తూ బాధితుడిపై మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.

ఈ కేసు నుంచి బయటపడాలంటే సుప్రీంకోర్టు అధికారులను “మేనేజ్ చేయాల్సి ఉంటుంది” అంటూ బాధితుడి ఆర్థిక వివరాలు కోరారు. తరువాత అతని బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్టు నమ్మబలికారు.

₹1.66 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

బ్యాంకులో అసెస్‌మెంట్ కోసం ఉంచిన రూ.1.66 కోట్లను వివిధ ట్రాన్సాక్షన్ల ద్వారా నేరగాళ్లు దోచుకున్నారు. కొంతసేపటికి మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో పోలీసులను సంప్రదించారు.

దీంతో మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై హెచ్చరిక

పోలీసుల ప్రకారం, ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయి. నేరగాళ్లు పోలీస్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేర్లు చెప్పి ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

అధికారులు ఎప్పుడూ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బులు అడగరని, ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read : హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి ముఠా బస్టు… రూ.18.26 లక్షల విలువైన 460 కిలోలు సీజ్

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »