HYDRAA Prajavaani: హైడ్రా ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదులు.. కబ్జాదారులపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్!

హైడ్రా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల ఆక్రమణలు, పార్కుల కబ్జాలు, బోగారంలో ఇంజినీరింగ్ కాలేజీ కబ్జాపై కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి దర్యాప్తుకు ఆదేశించారు.

HYDRAA Encroachment Complaints
HYDRAA Encroachment Complaints

హైదరాబాద్  : నగర పరిధిలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కబ్జాదారులు నిస్సిగ్గుగా మాయం చేస్తున్నారు. ఒకచోట రహదారి కబ్జా, మరోచోట పార్కు, ఇంకో కాలనీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లేఅవుట్ వేసినప్పుడు ఎంతో ముందుచూపుతో పాఠశాల, క్రీడాస్థలం, పార్కు, లైబ్రరీ కోసం కేటాయించిన స్థలాలను తర్వాతి కాలంలో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. గతం నుంచి ఇలా కబ్జాలకు గురైన స్థలాలను కాపాడుకోవడానికి నగర ప్రజలు ‘హైడ్రా’ (HYDRAA)ను ఆశ్రయిస్తున్నారు.

ప్రతి సోమవారం నిర్వహించే హైడ్రా ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఈ వారం కూడా ఫిర్యాదులు పోటెత్తాయి. కేవలం వంద గజాల పార్కు స్థలం ఆక్రమణకు గురైనా ప్రజలు మౌనంగా ఉండకుండా హైడ్రాకు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. సోమవారం జరిగిన ఈ ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్, అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య స్వయంగా పరిశీలించి, వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.

ప్రధాన ఫిర్యాదులు మరియు లొకేషన్ల వివరాలు:

1. బోగారంలో ఇంజినీరింగ్ కాలేజీ కబ్జా పర్వం

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర మండలం, బోగారం గ్రామంలోని సుచిరిండ్యా ప్రాజెక్టులో కొనుగోలు చేసిన దాదాపు 21 ప్లాట్లను హోళిమేరి గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకుందని బాధితులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

2. చెంగిచెర్లలో ప్రభుత్వ స్థలాల విక్రయం

మల్కాజిగిరి మండలం చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 130లో ఉన్న జయప్రద కాలనీలో ప్రజా అవసరాల స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు స్థానికులు వాపోయారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాల్సిన 1200 చదరపు గజాల స్థలాన్ని వంద గజాల ప్లాట్లుగా మార్చి ఇళ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. కాలనీలో వాటర్ ట్యాంక్, ఆలయం, పాఠశాల, లైబ్రరీ, పార్కు కోసం కేటాయించిన భూములను కూడా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

3. హఫీజ్‌పేట్‌లో సీవరేజ్ లైన్‌పై ఇల్లు నిర్మాణం

శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని సాయినగర్ యూత్ కాలనీలో ఓ వ్యక్తి రోటరీ డాక్యుమెంట్ ఆధారంగా ప్రధాన మురుగు కాలువ (సీవరేజ్ లైన్) పైనే అక్రమంగా ఇల్లు నిర్మించాడు. అంతటితో ఆగకుండా ఇళ్ల కిందుగా వెళ్లే పైప్‌లైన్‌ను మూసివేయడంతో మురుగు నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతోందని, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

4. చందానగర్, బేగంపేట సమస్యలు

చందానగర్ హుడా కాలనీలోని మంజీరా పైపులైను రోడ్డును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నారని, ఆ పనులను వెంటనే ఆపాలని స్థానికులు కోరారు. మరోవైపు బేగంపేటలోని బ్రాహ్మణవాడ రోడ్డు నంబరు 7లో ఓ ఇల్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, దానిని తొలగించి పక్కన ఉన్న నివాసితులకు ప్రమాదం లేకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

బొడుప్పల్ కుంట డ్రైనేజీ పనులపై నిరసన

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ విలేజ్‌లోని సుద్దకుంట (బోడుప్పల్‌కుంట) లోంచి వేస్తున్న బాక్స్ డ్రైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరారు. ప్రస్తుతం ఉన్న లైనును మార్చి రహదారిలో బాక్సు డ్రైన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల గ్రావిటీ (ఎత్తుపల్లాలు) ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. రాచెరువు – సుద్దకుంట – ఉప్పల్ నల్లచెరువును కలుపుతూ సాగే ఈ వరద కాలువ ద్వారా నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వ్యర్థజలాలు కూడా కలిసి వస్తున్నాయని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »