మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణ.. కొత్త కమిషనర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకంతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగించింది.

Greater Hyderabad Reorganization into Three Municipal Corporations
Greater Hyderabad Reorganization into Three Municipal Corporations

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. నగర విస్తీర్ణం, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లు కొత్తగా పనిచేయనున్నాయి. మొత్తం డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలనా వ్యవస్థను విస్తరించారు. అయితే రాజధాని నగర హోదా మాత్రం జీహెచ్ఎంసీకే కొనసాగనుంది.

ఉత్త‌ర్వులు జారీ..

మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ కమిషనర్‌గా సృజన, మల్కాజ్‌గిరి కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రేటర్ పాలకమండలి గడువు ముగియడంతో కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్‌ను నియమించారు. అదే విధంగా మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్. పంకజ, హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం. సంతోష్, లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె. కిరణాచారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..

ఈ పునర్వ్యవస్థీకరణతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగించారు. సవ్యసాచి ఘోష్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించగా, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా కొనసాగనున్నారు. సందీప్ కుమార్ సుల్తానియాను తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TGRAC) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. దివ్య దేవరాజన్‌కు పంచాయతీ రాజ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించగా, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవిని నియమించారు. అలాగే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ & కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురామ్ శర్మలకు బాధ్యతలు అప్పగించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »