హైదరాబాద్‌లో దారుణం … వీధి కుక్కల రక్తంతో అక్రమ దందా, బ‌య‌ట‌ప‌డిన ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రి బండారం

షేక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రిలో వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రాకెట్ బట్టబయలు అయింది. తప్పుడు రిపోర్టులతో పెంపుడు జంతువుల యజమానులను మోసం చేసి లక్షల్లో దోపిడీ చేస్తున్న అమానుష వ్యవహారం బయటపడటంతో నగరంలో కలకలం రేగింది.

హైదరాబాద్‌లోని వెటర్నరీ ఆసుపత్రిలో బంధించబడిన వీధి కుక్కలు మరియు స్వాధీనం చేసుకున్న రక్తపు ప్యాకెట్లు.
హైదరాబాద్‌లోని వెటర్నరీ ఆసుపత్రిలో బంధించబడిన వీధి కుక్కలు మరియు స్వాధీనం చేసుకున్న రక్తపు ప్యాకెట్లు.

హైదరాబాద్ నగరంలో జంతువులపై జరుగుతున్న అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మనుషుల అవయవాలు, రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతుందని వింటుంటాం. కానీ ఇప్పుడు మూగజీవాలనే లక్ష్యంగా చేసుకుని వాటి రక్తంతో దందా నడిపిస్తున్న ఘటన షేక్‌పేట్ ప్రాంతంలో బయటపడింది. ఓ ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రిలో వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని అధిక ధరలకు అమ్ముతున్న రాకెట్‌ను అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారం బయటపడటానికి జంతు ప్రేమికులే కారణమయ్యారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ కూడా ఈ విషయాన్ని రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒక్కో ప్యాకెట్‌కు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు..

ఆసుపత్రి నిర్వాహకుల పని తీరే అత్యంత దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. ముందుగా వీధి కుక్కలను పట్టుకుని ఆసుపత్రిలోని బోన్లలో బంధిస్తారు. అనంతరం చికిత్స కోసం వచ్చే ఖరీదైన పెంపుడు కుక్కల యజమానులను టార్గెట్ చేస్తారు. వారి జంతువులకు రక్తహీనత ఉందని తప్పుడు రిపోర్టులు చూపించి, వెంటనే రక్తం ఎక్కించాల్సిందేనని భయపెడతారు. అలా బందీగా ఉంచిన వీధి కుక్కల నుంచి తీసిన రక్తాన్ని ఒక్కో ప్యాకెట్‌కు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ అక్రమ దందాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో విషయం మరింత తీవ్రంగా మారింది. బలవంతంగా పదేపదే రక్తం తీయడం వల్ల బందీగా ఉన్న కుక్కలు తీవ్ర రక్తహీనతకు గురై మరణిస్తున్నట్లు సమాచారం. కొన్నిసార్లు చికిత్స కోసం వచ్చిన ఇతర పెంపుడు జంతువుల నుంచి కూడా యజమానుల అనుమతి లేకుండా రక్తాన్ని సేకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యాపార ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యం..

వాస్తవానికి జంతువుల రక్తదానం కఠిన నిబంధనల ప్రకారం జరగాలి. ఆరోగ్యంగా ఉన్న జంతువు యజమాని సమ్మతితోనే రక్తం తీసుకోవాలి. కానీ ఈ ఆసుపత్రిలో ఎలాంటి నియమాలు పాటించకుండా పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

నగరంలో జంతువుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలు లేకపోవడం కూడా ఇలాంటి అక్రమాలకు కారణమని భావిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పశువైద్య అధికారులు ఆసుపత్రిపై దాడులు నిర్వహించి రికార్డులు, నిల్వ ఉంచిన రక్తపు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నగరంలో జంతు సంక్షేమంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »