GHMC Food Safety: బిడ్డల పాలు, చికెన్ వ్యర్థాలు.. నగరంలో పట్టుబడిన కల్తీ పదార్థాల లిస్ట్ చూస్తే షాకవుతారు!

హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసి 121.87 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసింది. కల్తీ రాయుళ్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీపీ సజ్జనర్ హెచ్చరించారు.

Hyderabad H-FAST Food Adulteration
Hyderabad H-FAST Food Adulteration

ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ నిరంతర సమరం

తినే అన్నంలో కల్తీలు, తాగే పాలలో రసాయనాలు, చివరకు పసిబిడ్డలు తాగే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు కలిపి ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ రంగంలోకి దించిన ప్రత్యేక విభాగం ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST – Hyderabad Food Adulteration Surveillance Team) విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రత్యేక విభాగం టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ నగరంలో ఆహార కల్తీపై రాజీలేని పోరాటం చేస్తోంది.

ఆహార కల్తీ వల్ల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడి దేశానికి వెన్నెముక లాంటి యువశక్తి నశిస్తోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ నిశ్శబ్ద ముప్పును అరికట్టి, పౌరులకు స్వచ్ఛమైన ఆహారం అందించడమే లక్ష్యంగా హెచ్-ఫాస్ట్ పనిచేస్తోంది.

వంద రోజుల్లో విస్తుపోయే నిజాలు.. జోన్ల వారీగా వివరాలు

గడిచిన 100 రోజుల్లో హెచ్-ఫాస్ట్ బృందం నగరవ్యాప్తంగా విసృ్తత దాడులు నిర్వహించి మొత్తం 185 కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

జోన్ల వారీగా నమోదైన కేసులు:

  • రాజేంద్రనగర్ జోన్: 55 కేసులు (అత్యధికం)
  • గోల్కొండ జోన్: 44 కేసులు
  • సికింద్రాబాద్ జోన్: 35 కేసులు
  • చార్మినార్ జోన్: 21 కేసులు
  • శంషాబాద్ జోన్: 13 కేసులు
  • జూబ్లీహిల్స్ జోన్: 12 కేసులు
  • ఖైరతాబాద్ జోన్: 5 కేసులు

స్వాధీనం చేసుకున్న ప్రధాన కల్తీ పదార్థాలు:

నిత్యం వంటల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో 27,024 కేజీల నకిలీ నిల్వలను, కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల నుండి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. అలాగే, చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించి 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ వ్యర్థ చికెన్‌ను, 12 కేసుల్లో 15 టన్నుల నాణ్యత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కల్తీ కోవా (4,030 కేజీలు), నకిలీ టీ పొడి (3,897 కేజీలు), నిల్వ పచ్చళ్లు (9,260 కేజీలు), కల్తీ పనీర్ (1,514 కేజీలు), కల్తీ నెయ్యి మరియు పెరుగులను భారీగా పట్టుకున్నారు.

జీహెచ్‌ఎంసీకి 247 కేసులు బదిలీ.. వ్యాపారులకు హెచ్చరికలు

పోలీసు చర్యలతో పాటు తదుపరి సాంకేతిక, చట్టపరమైన విచారణ నిమిత్తం మరో 247 కేసులను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ఇందులో పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్లాంట్లపై 9, బేకరీలపై 6, జెప్టో (Zepto) పై 5, హాస్టళ్లపై 4 కేసులు ఉన్నాయి.

కల్తీ నివారణలో భాగంగా హైదరాబాద్ సీపీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, నిల్వల్లో ‘ఫిఫో’ (FIFO – First In, First Out) పద్ధతిని పాటించాలని, వాడిన నూనెను పదే పదే వాడకూడదని స్పష్టం చేశారు.

“కల్తీని మేము చిన్న వ్యాపార మోసంగా చూడటం లేదు; ఇది ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం. నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రాణాలు హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించడానికి కూడా వెనుకాడబోం.”

శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, హైదరాబాద్ సీపీ

ఆహార కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని సీపీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి గానీ, లేదా హెచ్-ఫాస్ట్ ప్రత్యేక నంబర్ 8712661212కు వాట్సాప్/ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Also Read: కుళ్లిన చేపలు, రొయ్యల అక్రమ నిల్వ ముఠా ఆటకట్టించిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు!

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1. హైదరాబాద్‌లో ఆహార కల్తీపై నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పేరేమిటి?

ఈ ప్రత్యేక విభాగం పేరు 'హెచ్-ఫాస్ట్' (H-FAST - Hyderabad Food Adulteration Surveillance Team). ఇది ఈ ఏడాది మార్చి 19న ఏర్పాటైంది.

Q2. హెచ్-ఫాస్ట్ గత 100 రోజుల్లో ఎన్ని కేసులు నమోదు చేసి, ఎంత కల్తీ సొత్తును పట్టుకుంది?

వంద రోజుల సమరంలో ఈ విభాగం మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

Q3. ఆహార కల్తీపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి పోలీసులు కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ ఏది?

ప్రజలు నేరుగా డయల్ 100కి కాల్ చేయవచ్చు లేదా హెచ్-ఫాస్ట్ ప్రత్యేక నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »