హైద‌రాబాద్‌లో కిడ్నాప్ డ్రామా: ప్రియురాలితో పారిపోయిన భర్త.. పోలీసుల దర్యాప్తులో అసలు ట్విస్ట్

ఉప్పల్ పరిధిలో కిడ్నాప్‌గా భావించిన ఘటన ప్రేమ వ్యవహారంగా తేలింది. భార్యను మోసం చేసి, మొబైల్ ఇంట్లో వదిలేసి ప్రియురాలితో కలిసి పరారైన భర్త డ్రామా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రస్తుతం నిందితుడి లొకేషన్ ఒడిశాలో గుర్తించినట్లు సమాచారం.

Hyderabad Kidnap Drama
Hyderabad Kidnap Drama

సాధారణంగా ఎవరైనా కిడ్నాప్ అయ్యారంటే కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయిస్తారు. అయితే హైద‌రాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఒక ఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. రామంతాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రావూరి పూర్ణచందర్ అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పర్చేజ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్య బయటకు రాకుండా డోర్‌కు బయట నుంచి గడియ పెట్టాడు. తనను పోలీసులు ట్రాక్ చేయకుండా మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలేశాడు. “స్నేహితులు వచ్చారు” అంటూ నమ్మించి అపార్ట్‌మెంట్ బయట వేచి ఉన్న ఇద్దరు యువతులు, మరో వ్యక్తితో కలిసి వాహనంలో వెళ్లిపోయాడు.

Also Read: హైద‌రాబాద్‌లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్

భార్య ఫిర్యాదు.. కిడ్నాప్ అనుమానం

ఉదయం లేచిన భార్యకు భర్త కనిపించకపోవడంతో పాటు డోర్ బయట గడియ ఉండటం గమనించి కంగారు పడింది. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అది కిడ్నాప్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అతను పనిచేసే పబ్ యాజమాన్యం కూడా హైద‌రాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు సీరియస్ అయింది.

దర్యాప్తులో సంచలన మలుపు

కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన యువతుల్లో ఒకరు అదే పబ్‌లో పనిచేస్తున్నారని గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. పూర్ణచందర్ చాలా కాలంగా ఓ బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఆమెతో కలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలింది. ప్రస్తుతం వారిద్దరూ ఒడిశాలో ఉన్నట్లు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

కుటుంబం షాక్‌లో

తొమ్మిదేళ్ల కూతురు, భార్య ఉన్నప్పటికీ అక్రమ సంబంధం కోసం ఇంతటి హైడ్రామా సృష్టించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు నిందితుడిని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »