గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.60 పెంపు .. నేటి నుంచి కొత్త ధరలు అమలు

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెరిగాయి.

LPG Gas Price Hike
LPG Gas Price Hike

దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు శనివారం (మార్చి 7, 2026) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. దాదాపు ఏడాది కాలంగా స్థిరంగా ఉన్న గృహ వినియోగ గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడం గృహిణులు, చిన్న వ్యాపారులపై అదనపు భారాన్ని మోపనుంది.

అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, ఇంధన సరఫరా గొలుసులో ఏర్పడిన మార్పులు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో గ్యాస్ ధరలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..

తాజా పెంపుతో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60 మేర పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి.

దిల్లీ: రూ.853 నుంచి రూ.913కు పెరిగింది

ముంబై: రూ.852.50 నుంచి రూ.912.50కు చేరింది

కోల్‌కతా: రూ.879 నుంచి రూ.939కు పెరిగింది

చెన్నై: రూ.868.50 నుంచి రూ.928.50కు చేరింది

హైదరాబాద్: రూ.905 నుంచి రూ.965కు పెరిగింది

కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెంపు

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌తో పాటు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను కూడా చమురు సంస్థలు పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 మేర పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:

దిల్లీ: రూ.1883

ముంబై: రూ.1835

కోల్‌కతా: రూ.1990

చెన్నై: రూ.2043.50

హైదరాబాద్: రూ.2076.50

గత 2025 ఏప్రిల్ తర్వాత గృహ వినియోగ గ్యాస్ ధరల్లో మార్పు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా కేవలం కమర్షియల్ సిలిండర్ ధరలు మాత్రమే పెరుగుతూ వచ్చాయి. అవి పరోక్షంగా సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నప్పటికీ, ఇప్పుడు నేరుగా డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఉజ్వల పథకం వినియోగదారులకు ఊరట

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి ఉజ్వ‌ల యోజ‌న పథకం కింద అందించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. దీంతో ఆ పథకం లబ్ధిదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

ఇంధన కొరత లేదంటున్న కేంద్ర ప్రభుత్వం

దేశంలో ఇంధన సరఫరాపై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీ స్పందించారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలకు సరసమైన మరియు స్థిరమైన ఇంధనాన్ని అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అదే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ కూడా ఖండించింది. దేశవ్యాప్తంగా సరఫరా, పంపిణీ వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని సంస్థ స్పష్టం చేసింది. ప్రజలు అపోహలు నమ్మి పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడవద్దని విజ్ఞప్తి చేసింది.

వ్యూహాత్మక నిల్వలు, దిగుమతులతో భద్రత

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్ ఇంధన భద్రత విషయంలో ధీమాగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్ తన ముడి చమురు దిగుమతులను విభిన్న దేశాల నుంచి పొందే విధంగా వ్యూహం అమలు చేస్తోంది.

2022లో రష్యా నుంచి కేవలం 0.2 శాతం మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, ప్రస్తుతం ఆ వాటాను గణనీయంగా పెంచింది. ఫిబ్రవరి నాటికి దేశ అవసరాలలో దాదాపు 20 శాతం (రోజుకు సుమారు 1.04 మిలియన్ బ్యారెళ్లు) ముడి చమురు ర‌ష్యా నుంచే దిగుమతి అవుతోంది.

అదేవిధంగా 2026 కాంట్రాక్ట్ ఏడాదికి సంబంధించి అమెరికా నుంచి కూడా ఎల్‌పీజీ దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఏటా సుమారు 2.2 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక దేశీయ రిఫైనరీలకు కూడా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Also Read: ₹3,000 నెలకు పెన్షన్.. రైతులకు కేంద్రం కీలక పథకం – ఎలా పొందాలి?

తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది?

14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరపై రూ.60 పెంపు జరిగింది. హైదరాబాద్‌లో ధర రూ.905 నుంచి రూ.965కు చేరింది.

2. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది?

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.115 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో ధర రూ.2076.50కు చేరింది.

3. ఉజ్వల పథకం లబ్ధిదారులపై ఈ పెంపు ప్రభావం ఉంటుందా?

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ పొందుతున్న వినియోగదారుల ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »