దేశాన్ని కాపాడే సైనికులు కేవలం యుద్ధరంగంలోనే కాదు, మానవత్వంలో కూడా ఎంత గొప్పవారో మరోసారి నిరూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుక ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. అమర జవాను కుమార్తె పెళ్లిలో అతని తోటి సైనికులు తండ్రి పాత్రను పోషించి ఆమెను అత్తింటికి సాగనంపిన తీరు అందరినీ కదిలించింది.
బాగ్‌పత్ జిల్లాలోని కాతా గ్రామానికి చెందిన హవల్దార్ హరేంద్ర సింగ్ భారత సైన్యంలో 21 జాట్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తోంది.
తోటి జవాను కుటుంబానికి అండగా..
ఇటీవల హరేంద్ర సింగ్ కుమార్తె ప్రాచి వివాహం నిశ్చయమైంది. ఈ శుభకార్యానికి తండ్రి పనిచేసిన రెజిమెంట్‌లోని సైనికులను కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. తమ తోటి జవాను కుటుంబానికి అండగా నిలవాలని భావించిన సైనికులు ప్రాచిని తమ సొంత బిడ్డగా భావించి పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
Also Read: రాజమండ్రిలో కల్తీ పాలు విషాదం – మృతుల సంఖ్య పెరుగుతోంది
మార్చి 9న జరిగిన ఈ వివాహానికి 21 జాట్ రెజిమెంట్‌కు చెందిన అధికారులు, సుబేదార్లు మరియు ఇతర సైనికులు ప్రత్యేకంగా సెలవు తీసుకుని వచ్చారు. పెళ్లి వేడుకలో వారు చేసిన పని చూసి అక్కడికి వచ్చిన అతిథులంతా భావోద్వేగానికి లోనయ్యారు.
అరచేతులని నేలపై బాటలా..
ప్రాచిని పెళ్లి పీటలపైకి తీసుకెళ్లే సమయంలో సైనికులు తమ అరచేతులను నేలపై బాటలా పరిచారు. ఆ వీర సైనికుల అరచేతులపై నడుస్తూ ప్రాచి జైమాల వేదికపైకి చేరుకుంది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది.
అంతటితో ఆగకుండా సైనికులు తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం కూడా నిర్వహించారు. అంతేకాదు తమ జీతాల నుంచి పోగు చేసిన సుమారు 6 లక్షల 50 వేల రూపాయలను ప్రాచికి కానుకగా అందజేశారు. ఆమెకు తండ్రి లేని లోటు తెలియకూడదనే భావనతో చేసిన ఈ చర్య అందరినీ కదిలించింది.
పెళ్లి అనంతరం వధువు అత్తింటికి బయలుదేరే సమయంలో సైనికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు సైన్యం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.