Trisha Krishnan Bomb Threat: ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం చెన్నైలో కలకలం రేపింది. పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ ఈమెయిల్‌లో త్రిష ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలో ఉన్న త్రిష నివాసానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబు గుర్తింపు, నిర్వీర్య దళం (BDDS), డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహాయంతో ఇంటి ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు గుర్తించకపోవడంతో ఇది నకిలీ బాంబు బెదిరింపుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
రజనీ, ధనుష్ ఇళ్లలో కూడా..
ఇదిలా ఉండగా, ఇదే రోజున చెన్నైలోని సాలిగ్రామంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, అలాగే బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. కానీ ఎక్కడా ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించకపోవడంతో ఈ బెదిరింపులు కూడా నకిలీ అని తేల్చారు.
అంతకుముందు కూడా పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్, ధనుష్ నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటికీ పోలీసులు తనిఖీలు నిర్వహించి, అవి ఫేక్ మెయిల్స్ అని నిర్ధారించారు.
వీటి వెనక ఎవరున్నారు?
తరచూ ప్రముఖుల ఇళ్లు, ముఖ్యమైన కార్యాలయాలకు ఈ తరహా బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఎవరో ఆకతాయిలు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈమెయిల్స్ ఎక్కడి నుంచి పంపబడ్డాయి? వాటి వెనక ఎవరు ఉన్నారు? అనే దిశగా సైబర్ క్రైమ్ విభాగం లోతుగా విచారణ చేపట్టింది. ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసి నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వరుసగా వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు భద్రతా వ్యవస్థలకు సవాల్‌గా మారుతున్నాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read:


