గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనపు ఛార్జీలు అడుగుతున్నారా? తెలుసుకోండి

గ్యాస్ సిలిండర్ డెలివరీకి డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులు అడిగితే చెల్లించాల్సిన అవసరం లేదు. బిల్లులో ఛార్జీలు, ఫిర్యాదు చేసే విధానం తెలుసుకోండి.

గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు
గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్‌ ఇంటి వద్దకు సిలిండర్‌ తీసుకొచ్చి అందిస్తారు. అయితే కొందరు డెలివరీ బాయ్స్‌ సిలిండర్‌ డెలివరీ చేసినందుకు అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకు చార్జీలు డిమాండ్‌ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సిందేనంటూ కస్టమర్లపై ఒత్తిడి తీసుకురావడం, ఇవ్వకపోతే వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి.

దీంతో చాలామంది వినియోగదారులు నిబంధనల ప్రకారం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా.. ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో డబ్బులు ఇస్తున్నారు.

బుక్‌ చేసిన ధర మాత్రమే చెల్లించాలి

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే సమయంలో బిల్లులో చూపించిన ధరనే వినియోగదారులు చెల్లించాలి. డెలివరీ బాయ్స్‌ అదనంగా డబ్బులు డిమాండ్‌ చేయడం నిబంధనలకు విరుద్ధం. వినియోగదారులు తమ ఇష్టంతో డబ్బులు ఇస్తే అది వేరే విషయం. కానీ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు.

గ్యాస్‌ ఏజెన్సీ గోదాము నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో సిలిండర్‌ డెలివరీకి ఎలాంటి రవాణా ఛార్జీ ఉండదు. ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొన్ని సందర్భాల్లో సుమారు రూ.20 వరకు డెలివరీ ఛార్జీ ఉండవచ్చు. అయితే ఆ ఛార్జీ గ్యాస్‌ బిల్లులోనే నమోదై ఉంటుంది.

అందువల్ల వినియోగదారులు సిలిండర్‌ బిల్లు తీసుకున్నప్పుడు అందులో ఉన్న ఛార్జీల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. బిల్లులో ఇప్పటికే డెలివరీ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జీ చేర్చబడి ఉంటే.. మళ్లీ డెలివరీ బాయ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అదనపు డబ్బులు అడిగితే ఎలా ఫిర్యాదు చేయాలి?

డెలివరీ బాయ్‌ అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే ముందుగా సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలి. అక్కడి నుంచి సరైన స్పందన రాకపోతే ఆయిల్‌ కంపెనీ హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు: 1800-2333-555

భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు: 1800-22-4344

హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు: 1800-2333-555

సాధారణ LPG ఫిర్యాదుల కోసం: 1800-2333-555

ఫిర్యాదు చేసే సమయంలో గ్యాస్‌ బుకింగ్‌ వివరాలు, వినియోగదారు నంబర్‌, డెలివరీ తేదీ, అదనపు డబ్బులు అడిగిన విధానం వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

అలాగే సోషల్‌ మీడియా ద్వారా కూడా సమస్యను తెలియజేయవచ్చు. ఇందుకోసం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక సోషల్‌ మీడియా ఖాతా @MoPNG_eSevaను ట్యాగ్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

డెలివరీ బాయ్స్‌ కష్టాన్ని గౌరవించాలి

మరోవైపు డెలివరీ బాయ్స్‌ కూడా తమ కష్టాన్ని వినియోగదారులు గుర్తించాలని కోరుతుంటారు. ముఖ్యంగా లిఫ్ట్‌ లేని ఇళ్లలో మూడు, నాలుగు అంతస్తుల వరకు సిలిండర్‌ను మోసుకెళ్లాల్సి ఉంటుంది. కొందరు వినియోగదారులు వారి కష్టాన్ని గుర్తించి స్వచ్ఛందంగా కొంత మొత్తాన్ని ఇస్తుంటారు.

అయితే స్వచ్ఛందంగా ఇవ్వడం వేరు.. తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం వేరు. డెలివరీ బాయ్‌ అదనపు చార్జీ అడగకపోయినా, వినియోగదారులు తమ ఇష్టంతో ఇచ్చే మొత్తాన్ని బలవంతపు వసూళ్లుగా పరిగణించలేం. కానీ అదనపు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధం.

కాబట్టి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో బిల్లులో ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించండి. అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే ముందుగా గ్యాస్‌ ఏజెన్సీకి, అవసరమైతే ఆయిల్‌ కంపెనీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »