పట్టణ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల మేయర్లు, చైర్పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది.
మొత్తం 36 మందిలో 22 మంది అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. 16 స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. అంటే తొలి జాబితాలోనే 44 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. 34 శాతం కంటే ఎక్కువే ఇస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని టీడీపీ పేర్కొంది.
మేయర్ అభ్యర్థుల్లోనూ సామాజిక న్యాయం
ఏడుగురు మేయర్ అభ్యర్థుల్లో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఆళ్లగడ్డ, రాయచోటి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులుగా మైనార్టీలను ఖరారు చేశారు. మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు.
మంగళగిరి, తాడేపల్లితో పాటు మిగతా కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను తర్వాత ప్రకటించనున్నారు.
ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా, సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజల విశ్వాసం, సమర్థ నాయకత్వం, సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ తెలిపింది.
విద్యార్హతలకు ప్రాధాన్యం
ఈసారి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై విస్తృత కసరత్తు చేశారు. ఆయా పట్టణాలు, నగరాలకు సమర్థ నాయకత్వం అందించగల వారిని గుర్తించేందుకు అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించారు.
అభ్యర్థుల ఎంపికలో వారి విద్యార్హతలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తొలి జాబితాలోని 36 మందిలో 25 మంది అంటే 76 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగినవారు ఉన్నారు. వీరిలో ఏడుగురు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగినవారు ఉన్నారు. ముగ్గురు వైద్యులకు కూడా అవకాశం కల్పించారు.
యువతకు ప్రాధాన్యం
తొలి జాబితాలో అభ్యర్థుల సగటు వయసు 45.7 సంవత్సరాలుగా ఉంది. మొత్తం 36 మందిలో 16 మంది 47 ఏళ్లలోపు వారు ఉన్నారు. ఏడుగురు మేయర్ అభ్యర్థుల సగటు వయసు 39 సంవత్సరాలుగా ఉంది.
మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థుల సగటు వయసు 47.5 సంవత్సరాలు కాగా, మేయర్ అభ్యర్థుల సగటు వయసు దానికంటే సుమారు తొమ్మిదేళ్లు తక్కువగా ఉంది.
మహిళలకు పెద్దపీట
తొలి జాబితాలో మహిళలకు కూడా టీడీపీ పెద్దపీట వేసింది. మొత్తం 36 మందిలో 19 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలు 17 ఉండగా, టీడీపీ 19 మందికి అవకాశం కల్పించింది.
మహిళలకు రిజర్వ్ కాని చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించినట్లు టీడీపీ వెల్లడించింది.



