ఆడి ప‌రువు పోగొట్టుకున్న పాకిస్తాన్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న పాక్ ఫ్యాన్స్

టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో టీమిండియా సూపర్-8 దశకు అర్హత సాధించింది.

India celebrating victory against Pakistan in T20 World Cup match after 61-run win
India celebrating victory against Pakistan in T20 World Cup match after 61-run win

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్-బ్యాటింగ్ లో సమన్వయం చూపించిన టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8కు అర్హత సాధించింది. ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్, బుమ్రా స్పెల్ మ్యాచ్ హైలైట్‌గా నిలిచాయి.

టీ20 ప్రపంచకప్‌లో భార‌త్ -పాక్ మ‌ధ్య జ‌రిగిన పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జ‌ట్టును 61 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. బౌలింగ్‌లో కట్టుదిట్టమైన ప్రదర్శన, బ్యాటింగ్‌లో దూకుడు కలిసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాయి.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. క్రీజులో ఉన్నంతసేపు ఇండియా 200 దాటుతుందనే భావన కలిగించిన ఇషాన్ ఔటైన తర్వాత మాత్రం పరుగుల వేగం తగ్గింది.

క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్..

పాకిస్థాన్ స్పిన్నర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయినప్పటికీ చివర్లో శివమ్ దూబె (27) మరియు రింకు సింగ్ (11 నాటౌట్) కలిసి వేగంగా పరుగులు సాధించి జట్టు స్కోరును 170 దాటించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభం నుంచే కుదేలైంది.

తొలి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బుమ్రా తన క్లాస్ చూపించాడు. ఒకే ఓవర్లో సయీమ్ అయూబ్, సల్మాన్ అఘాలను ఔట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు.

స్పిన్నర్లు కూడా రంగంలోకి దిగి పాక్ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. బాబర్ అజాం తక్కువ స్కోరుకే అవుట్ కావడం పాక్‌కు భారీ దెబ్బ త‌గిలిన‌ట్టైంది. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కొంతసేపు ప్రతిఘటించినా అతనిని అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో పాక్ ఆశలు ఆవిరైపోయాయి. వరుణ్ చక్రవర్తి కీలక సమయంలో రెండు వికెట్లు తీసి విజయం దాదాపు ఖాయం చేశాడు. చివరకు పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది.

బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శన

భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పేస్-స్పిన్ కలయిక పాక్ బ్యాటర్లను పూర్తిగా అణచివేసింది.

ఈ విజయంతో భారత్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సూపర్-8 దశకు అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది.

మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో పాకిస్థాన్ జట్టుపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్ చర్చలు జరగగా, చివరికి ఆడి ఓడిపోవడంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు భారత అభిమానులు మాత్రం జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »