కొలంబోలో భారత్–పాకిస్థాన్ మహాసమరానికి వర్షం ముప్పు… అభిమానుల్లో ఉత్కంఠ

టీ20 ప్రపంచ కప్ 2026లో హై వోల్టేజ్ మ్యాచ్‌గా భావిస్తున్న భారత్–పాకిస్థాన్ పోరుకు వాతావరణం ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొలంబోలో వర్షం వ‌చ్చే అవ‌కాశం 70 శాతం ఉంద‌ని చెప్ప‌డంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ind vs pak t20 world cup 2026 weather

టీ20 క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో భాగంగా ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌కు ముందు రోజే వాతావరణం మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక రాజధాని కోలంబోలో శనివారం సాయంత్రం తేలికపాటి జల్లులు పడటంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్‌కు వేదికైన ప్రేమ‌దాస స్టేడియంలో పిచ్‌తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని సిబ్బంది వెంటనే కవర్లతో కప్పేశారు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ అకాల వర్షాలు కురుస్తున్నట్లు శ్రీలంక వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మ్యాచ్ జరుగుతుందా? రద్దవుతుందా?

శ్రీలంక వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఆదివారం మ్యాచ్ సమయానికి 70 శాతం వరకు వర్షం కురిసే అవకాశముంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే కనీస ఫలితం రావాలంటే ఇరు జట్లు తలా ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మ్యాచ్ సాగాలంటే వర్షం తగ్గుముఖం పట్టాల్సిందే. అయితే అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే, ఆర్. ప్రేమదాస స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థ అత్యాధునికంగా ఉండటం. వర్షం ఆగిన తర్వాత కేవలం 20 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేసే సామర్థ్యం ఈ స్టేడియానికి ఉంది. దీంతో వర్షం కాస్త తగ్గినా మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

టీమిండియా వ్యూహాలు – అభిషేక్ శర్మపై ఆశలు

మరోవైపు భారత జట్టు ఈ కీలక పోరులో గెలిచి పాకిస్థాన్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ ఫిట్‌నెస్ సాధించి తుది జట్టులోకి వస్తాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. మిడిల్ ఆర్డర్ బలంగా ఉండటంతో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, ప్రకృతి సహకారం కీలకంగా మారింది.

మొత్తంగా చూస్తే, అభిమానులు ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ పోరు ఉత్కంఠ రేపుతున్నప్పటికీ, వర్షం రూపంలో అనిశ్చితి నెలకొనడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి సహకరిస్తేనే 40 ఓవర్ల అసలైన మజాను క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించగలరు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »