టీమ్ ఇండియా అండర్-19 జట్టుకు ఇటీవల గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ క్రికెటర్ ఈ ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కావడంలేదని తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈ విషయాన్ని వైభవ్ తండ్రే స్వయంగా ధృవీకరించడం గమనార్హం.
స్కూల్ ప్రిన్సిపాల్ స్పష్టీకరణ
తాజ్‌పూర్‌లోని మోడెస్టీ పాఠశాల ప్రిన్సిపాల్ ఆదర్శ్ కుమార్ అలియాస్ పింటూ మాట్లాడుతూ, వైభవ్ తండ్రితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రికెట్ ప్రాక్టీస్, టోర్నమెంట్లు, ట్రావెల్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో విద్యార్థి పరీక్షలకు సిద్ధం కావడం కష్టమైందని చెప్పారు. అన్ని ఫార్మాలిటీస్ , ప్రిపరేషన్, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ సెంటర్ అలాట్‌మెంట్ పూర్తయినా, చివరికి పరీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
బీసీసీఐ బిజీ షెడ్యూల్ కారణం
వైభవ్ షెడ్యూల్ మొత్తం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మ్యాచ్‌లు, క్యాంపులు, ట్రైనింగ్‌లతో నిండిపోయిందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. మొదట పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరినప్పటికీ, అండర్-19 టీమ్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ బాధ్యతల కారణంగా చివరికి బోర్డు ఎగ్జామ్స్ రాయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సమస్తిపూర్‌లోని పోడ్డార్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను వైభవ్‌కు పరీక్షా కేంద్రంగా కేటాయించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ మాట్లాడుతూ అడ్మిట్ కార్డు ఇప్పటికే జారీ అయిందని, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు స్కూల్ వద్ద భద్రంగా ఉంచామని తెలిపారు. సాధారణ విద్యార్థిలానే పరీక్షకు హాజరు అవుతాడని ముందుగా భావించినా, చివరికి గైర్హాజరు అవుతున్నట్లు స్పష్టమైంది.
వైభవ్‌కు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా పరీక్షా కేంద్రంలో భద్రతపై కూడా చర్చలు జరిగాయి. స్కూల్ యాజమాన్యం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి, బయట సెక్యూరిటీ బాధ్యతను పోలీసులకు అప్పగించింది. అయితే ఒక విద్యార్థి కోసం ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని, అందరికీ వర్తించే నియమాలే అతనికి కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 17 నుంచి బోర్డు పరీక్షలు
ఈ ఏడాది 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. అదే కేంద్రంలో రెండు తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయినప్పటికీ వైభవ్ ఈసారి పరీక్షలకు దూరంగా ఉండి క్రికెట్ కెరీర్‌కే పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాడు. యువ వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదువు–క్రీడల సమతౌల్యం గురించి నిపుణులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, అతని ప్రతిభపై మాత్రం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.