హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కన్వర్సేషనల్ వాయిస్ డిస్కవరీ (CVD) అనే వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చాట్ జీపీటీ (ChatGPT) సాంకేతికతతో పనిచేసే ఈ ఫీచర్, కేవలం కీవర్డ్స్ టైప్ చేసి సెర్చ్ చేసే పాత పద్ధతికి స్వస్తి పలికి.. వినియోగదారులు నేరుగా మాటలతో సంభాషిస్తూ తమకు నచ్చిన కంటెంట్‌ను వెతుక్కునే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్ రంగంలో సెర్చింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఈ విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారు.
ఈ సీవీడీ ఫీచర్ యూజర్ల మూడ్ లేదా సందర్భాన్ని బట్టి అత్యంత కచ్చితమైన సిఫార్సులను అందిస్తుంది. ఉదాహరణకు, “నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు, మేమంతా కలిసి చూడగలిగే ఏదైనా మంచి సినిమా సూచించండి” అని అడిగినా.. లేదా “నాకు డ్రామా కావాలి కానీ మరీ ఎమోషనల్‌గా ఉండకూడదు” వంటి లోతైన కోరికలను కోరినా ఈ సిస్టమ్ ఇట్టే అర్థం చేసుకుంటుంది. వినియోగదారుల అసలు ఉద్దేశాన్ని (Intent) గ్రహించి, వారు నేరుగా చెప్పలేని అవసరాలను కూడా గుర్తించేలా దీనిని తీర్చిదిద్దారు.
భారతదేశం వంటి విభిన్న భాషల దేశంలో ఈ ఫీచర్ బహుభాషా సామర్థ్యం (Multilingual) ఎంతో కీలకంగా మారనుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వినియోగదారులు సంభాషణ మధ్యలో భాష మార్చినా (Code-switching), సిఫార్సుల నాణ్యత తగ్గదు. “కోయి లైట్ హార్టెడ్ కామెడీ దిఖావో” వంటి హిందీ ప్రాంప్ట్‌లను కూడా ఇది ఇంగ్లీష్ క్వెరీలతో సమానమైన కచ్చితత్వంతో విశ్లేషిస్తుంది. మెట్రో నగరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ అత్యాధునిక ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశం.
