బాల్క సుమన్‌కు షరతులతో బెయిల్.. జైలు నుంచి విడుదల, మరింత ముదురిన రాజకీయ ఆరోపణలు

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల కేసులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌కు జిల్లా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైల

Balka Suman

క్యాతనపల్లిలో మంత్రిపై దాడి కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 18న ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. ఈ కేసు ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి హింసాత్మకంగా మారిన ఈ ఘటనలో బాల్క సుమన్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని అభియోగాలు మోపారు.

అయితే తన అరెస్టు అక్రమమని, సుప్రీంకోర్టు నిర్దేశించిన విధి విధానాలను పోలీసులు పాటించలేదని సుమన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. మరోవైపు, తదుపరి విచారణ కోసం సుమన్‌ను పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు మంచిర్యాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

షరతులతో బెయిల్

జిల్లా సెషన్స్ జడ్జి ఏ. వీరయ్య సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25,000 పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ కేసులో ఏ1, ఏ2, ఏ4, ఏ8 నిందితులుగా ఉన్నవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Also Read: సంక్షేమ పథకాల అమలులో కఠిన చర్యలు.. ముఖ గుర్తింపు తప్పనిసరి.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ఆదేశాలు

జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు.

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ 14 మంది కౌన్సిలర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి కోట్ల రూపాయల ఆఫర్లు చేశారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తలొగ్గలేదని, దీంతో కుట్రపూరితంగా కేసులు బుక్ చేశారని మండిపడ్డారు.

అలాగే, గొడవలో రాళ్లు విసిరిన వారిపై కేసులు నమోదు చేయకుండా తమ పార్టీకి చెందిన 25 మందిపై మాత్రమే కేసులు పెట్టారని ఆరోపించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారని తెలిపారు. మంత్రి కాన్వాయ్‌ను అనుమతించి తమను ఆపడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని విమర్శించారు.

జైలు వద్ద కోలాహలం

సుమన్ విడుదలవుతున్నారన్న సమాచారం వెలువడగానే ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయన జైలు గేటు దాటగానే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అనుచరులతో కలిసి క్యాతనపల్లికి ర్యాలీగా బయలుదేరారు.

క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజా తీర్పును గౌరవించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »