శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్న సమయంలో భద్రాచలం రామాలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సీతాదేవికి ఓ భక్తురాలు సమర్పించిన విలువైన పట్టుచీర గర్భగుడిలో నుంచి మాయం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌కు చెందిన జ్యోతి అనే భక్తురాలు భద్రాద్రి సీతారామలక్ష్మణులకు అలంకరణ కోసం పట్టు పంచెలతో పాటు ఖరీదైన పట్టుచీరను సమర్పించారు. ఆలయ అర్చకులు ఆ వస్త్రాలతో స్వామివారికి అలంకారం చేసిన అనంతరం, గర్భగుడిలోని ఊయల వద్ద ఆ పట్టుచీరను ఉంచినట్లు సమాచారం. అయితే కొద్దిసేపటికే ఆ చీర కనిపించకపోవడం కలకలం రేపింది.
Also Read: కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? మార్చి 1 నుండి వేలల్లో అదనపు భారం తప్పదు!
భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు..
ఆలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఈ ఘటన వాటికి చిక్కకపోవడం దేవస్థాన భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గర్భగుడి వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో వస్త్రాలు మాయం కావడం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ ఈవో దామోదర్ రావు వెంటనే విచారణకు ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనేక ప్రశ్నలు
దూర ప్రాంతాల నుంచి భక్తితో వస్త్రాలు సమర్పించే భక్తులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని దేవస్థాన అధికారులను డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి రామాలయంలో ఇప్పుడు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలు మాయం కావడం వెనక ఇంటి దొంగే ఉండి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. స్వామికి పెట్టిన పట్టు వస్త్రాలు చోరీకి గురి కావడం ఏంటని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


