కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? మార్చి 1 నుండి వేలల్లో అదనపు భారం తప్పదు!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ద్వారా రూ.7,519 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ.5,143 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.1,031 కోట్లు, రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా రూ.350–390 కోట్లు సమీకరించాలని భావిస్తున్నారు.

Telangana Road Safety Cess March 2026

తెలంగాణలో కొత్తగా వాహనం కొనాలనుకుంటున్న వారికి ముఖ్యమైన అప్‌డేట్. మార్చి 1, 2026 నుండి రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ సెస్ అమల్లోకి రానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదించగా, రవాణాశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కొత్త వాహనాన్ని RTA వద్ద రిజిస్ట్రేషన్ చేయించే సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత చెల్లించాలి?

నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనదారులపై వాహన శ్రేణిని బట్టి రూ.2వేల నుండి రూ.10వేల వరకు అదనపు మొత్తం వసూలు చేయనున్నారు. బైక్‌లు, కార్లు, ఆటోలు, ఇతర వ్యక్తిగత వాహనాలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయని అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరంలో ఏటా భారీ సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ భారం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపనుంది.

Also Read: హైదరాబాద్ హోటళ్లకు వెళ్తున్నారా? మీరు తింటున్నది ఈగలు వాలిన కల్తీ పేస్ట్ కావచ్చు!

రాష్ట్రంలో వాహన కొనుగోళ్ల సంఖ్య

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల ద్విచక్ర వాహనాలు, 2.57 లక్షల ఫోర్ వీలర్స్, లక్షకు పైగా లైట్ మరియు హెవీ వెహికిల్స్ రోడ్లపైకి వస్తున్నాయి. ఈ లెక్కన కొత్త సెస్ అమల్లోకి వస్తే రవాణాశాఖకు ఏటా రూ.350 నుండి రూ.390 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలే ఆధారం

రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు, వాహనదారులకు మెరుగైన భద్రతా వసతులు కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోటర్ వెహికిల్స్ చట్టంలో సవరణలు తీసుకువచ్చారు. అన్ని రాష్ట్రాలూ డెడికేటెడ్ రోడ్డు భద్రతా నిధి ఏర్పాటు చేయాలని, వసూలైన మొత్తాన్ని రోడ్ సేఫ్టీకే వినియోగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అదే ఆధారంగా చెప్పుకుంటోంది. అయితే వసూలైన నిధులు నిజంగా రోడ్ సేఫ్టీకే వెళతాయా అన్న అనుమానాలు పౌర సమాజంలో లేకపోలేదు.

ప్రభుత్వానికి ఆదాయ లక్ష్యం భారీగా పెరిగింది

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ ద్వారా రూ.7,519 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. లైఫ్ ట్యాక్స్ ద్వారా రూ.5,143 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.1,031 కోట్లు, రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా రూ.350–390 కోట్లు సమీకరించాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ రూ.5,788 కోట్లు వసూలు చేసింది. గతంతో పోల్చితే పన్నుల ఆదాయాన్ని దాదాపు రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో కొత్త వాహనం కొనాలనుకునే వారు మార్చి 1కి ముందే నిర్ణయం తీసుకోవాలా అనే ప్రశ్న వినియోగదారుల్లో తలెత్తుతోంది. ఫిబ్రవరి చివరి రోజుల్లో షోరూమ్‌ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »