భద్రాద్రి కొత్తగూడెం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ పారిశుద్ధ్యం నుండి ఆశ్రమ పాఠశాల వరకు, అంగన్‌వాడీ నిర్మాణం నుండి ఇందిరమ్మ ఇళ్ల వరకు అన్నింటినీ స్వయంగా పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇవ్వడంతో పాటు విద్యార్థులతో, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అర్థం చేసుకున్నారు.
బస్టాండ్ తనిఖీ.. బస్సుల సమస్యకు పరిష్కారం
చండ్రుగొండ బస్టాండ్ పరిసరాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బస్టాండ్‌లోకి బస్సులు రావడం లేదని వినతి పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
చండ్రుగొండ ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది, ఆహార నిల్వలు, త్రాగునీటి వసతి, కిచెన్ గార్డెన్ అన్నీ పరిశీలించారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని అడిగారు. విద్యార్థులు సరిపడా మరుగుదొడ్లు లేవని, ఫిజికల్ ట్రైనర్ అవసరమని చెప్పారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఐటీడీఏ పీవోతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయిదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ఇంగ్లీష్ చదివే సామర్థ్యాన్ని పరీక్షించారు. కిచెన్‌లో పాలు కాచి పాఠశాలలోనే పెరుగు తయారు చేసి విద్యార్థులకు ఇవ్వాలని, లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ నిర్మాణం పరిశీలన
బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారు ధరావత్ కృష్ణ నాయక్ సహా పలువురి ఇళ్లను చూశారు. నిర్మాణానికి ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారు, మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్నారా, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఇళ్లు పూర్తి చేసుకుని నివాసం ఉంటున్న లబ్ధిదారులను కూడా సందర్శించారు. చండ్రుగొండలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ అవగాహన కార్యక్రమం
బోర్ నీరు, మిషన్ భగీరథ నీరు, ఆర్వో నీటిలో లవణాల తేడాలను ప్రయోగాత్మకంగా ప్రజలకు వివరించారు. సురక్షిత త్రాగునీరు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాల అమలులో చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.